ప్రతినిధిసభను వేడుకుంటున్న పెంటగాన్
అమెరికా సైనిక బడ్జెట్లపై యుద్ధ ప్రభావం
రద్దయిన శిక్షణా కార్యక్రమాలు…కుంటుపడిన నిర్వహణ పనులు
టెహ్రాన్ : ఇరాన్‌పై సాగిస్తున్న పోరు అమెరికా సైనిక బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని సందర్భాలలో రక్షణ శాఖ నిధుల కొరతతో విలవిలలాడుతోంది. సైనిక శిక్షణా కార్యక్రమాలు రద్దవుతున్నాయి. నిర్వహణ పనులు కుంటు పడుతున్నాయి. దీంతో అదనపు నిధులు మంజూరు చేయాల్సిందిగా సైనిక నేతలు ప్రతినిధిసభపై ఒత్తిడి తెస్తున్నారు. నౌకాదళానికి చెందిన సీనియర్ అధికారి అడ్మిరల్ డరిల్ కాడిల్ ఈ నెల ప్రారంభంలో హౌస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ తమకు ఇచ్చిన బడ్జెట్‌ను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మింగేస్తోందని, రోజువారీ కార్యక్రమాలకు కూడా నిధుల కొరత ఎదురవుతోందని చెప్పారు. నిధులు లేకపోవడంతో శిక్షణ కార్యక్రమాలను, విమాన శిక్షణ గంటలను, కొత్తగా నియమితులైన వారికి శిక్షణను కుదించాల్సి వస్తోందని తెలిపారు. అదనపు నిధులు లేకుంటే రికార్డు స్థాయి నియామకాలకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
ఉలుకూ పలుకూ లేని ప్రతినిధిసభ
టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఓ సైనిక ప్రధాన కార్యాలయం 70 వేల సేనలను, వందలాది యుద్ధ ట్యాంకులను పర్యవేక్షిస్తుంటుంది. అయితే గత ఏప్రిల్‌లో దీని శిక్షణ బడ్జెట్‌లో 292 మిలియన్ డాలర్ల కోత పడింది. నిధుల కొరత కారణంగా వైద్య పాఠశాలలో అనేక కోర్సులు రద్దయ్యాయి. నిధుల కేటాయింపునకు ప్రతినిధిసభ అంగీకారం తెలిపితే తప్ప పరిస్థితి కుదుటపడే అవకాశాలు కన్పించడం లేదు. ఇరాన్‌పై యుద్ధం మొదలైనప్పుడు సైన్యం కోసం అదనపు నిధులను కోరే విషయంపై అధికారుల మధ్య చర్చ జరిగింది. ఇరాన్ యుద్ధానికి 200 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని కొందరు అధికారులు అంచనా వేశారు. అయితే అదనపు నిధులకు ఆమోదం తెలిపేందుకు ప్రతినిధిసభ సిద్ధంగా ఉన్నట్లు కన్పించడం లేదు. పెంటగాన్ తాజా అంచనాల ప్రకారం సుమారు 29 బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. అయితే ఈ మొత్తం దెబ్బతిన్న విమానాల మరమ్మతులకు, ఆయుధాల సేకరణకే సరిపోతుందని, ఇరాన్ దాడిలో ధ్వంసమైన సైనిక, వైమానిక స్థావరాల పునర్మిర్మాణానికి అయ్యే ఖర్చును దీనిలో చేర్చలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే 40-50 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని లెక్క తేల్చారు.
అమ్ములపొదిని నింపుకోవాలంటే…
ఇరాన్ యుద్ధంలో కొన్ని పరికరాలు దెబ్బతిని నిర్వహణ సమస్యలు తలెత్తాయి. వాటిని తిరిగి ఉపయోగించేలా చేయాలంటే నిధులు అవసరమవుతాయి. అయితే ఎంత అవసరమనేది ఇప్పుడే చెప్పడం కష్టం. పనులు జరిగే కొద్దీ అది తెలుస్తుంది. యుద్ధంలో పెంటగాన్ రక్షణ వ్యవస్థలు, క్షిపణులు చాలా వరకూ దెబ్బతిన్నాయి. ఖాళీ అయిన అమ్ములపొదిని తిరిగి నింపుకోవాలంటే చాలా డబ్బు అవసరమవుతుంది. ఏదేమైనా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఇరాన్ యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలను హరించింది. వాటిని తిరిగి భర్తీ చేసుకోవాలంటే భారీగానే డబ్బు అవసరమవుతుంది.
ఆర్థిక సంవత్సరం ముగియక ముందే…
అమెరికాలో ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగుస్తుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరలో సైన్యం నిధుల కొరతను మరింతగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితంగా కేటాయింపులు పెంచాల్సిందిగా కాంగ్రెస్‌ను పదేపదే అభ్యర్థించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఆర్థిక సంవత్సరం చివరలో తలెత్తాల్సిన పరిస్థితులు ఇప్పుడే కన్పిస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, సైనిక కార్యకలాపాలే దీనికి కారణం. ఇరాన్ యుద్ధం ఇప్పటికే ఉన్న సైనిక సన్నద్ధత సమస్యలను మరింత తీవ్రతరం చేసిందని వైమానిక దళ అధిపతి జనరల్ కెన్నెత్ విల్స్‌బచ్ గత వారం సెనెట్ సాయుధ సేవల కమిటీ ముందు చెప్పారు. అదనపు నిధుల అంశంపై నిధుల కేటాయింపు కమిటీ సభ్యులు రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్‌ను ఈ నెల ప్రారంభంలోనే నిలదీశారు. నిధుల కోసం అభ్యర్థన చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయనకు చెప్పారు.



