Friday, May 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తత

మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తత

- Advertisement -

ఇరాన్‌ సైనిక స్థావరంపై అమెరికా దాడి.. నాలుగు డ్రోన్ల కూల్చివేత
తమ దళాలు, నౌకలను కాపాడుకునేందుకేనని బుకాయింపు
ప్రతిగా కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై టెహ్రాన్‌ దాడి

నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడికి పోతోంది. హార్ముజ్‌ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్‌ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు జరిపింది. ఈ స్థావరం అమెరికా దళాలకు, జలసంధిలో నౌకల రాకపోకలకు ముప్పు కలిగిస్తోందని ఆరోపించింది. వ్యూహాత్మక కీలక ప్రాంతంలో భద్రతా సంబంధమైన ముప్పు తలెత్తకుండా చూసేందుకే ఈ ఆపరేషన్‌ జరిగిందని ఓ అధికారి తెలిపారు. బందర్‌ అబ్బాస్‌లోని ఇరాన్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ఐదో డ్రోన్‌ను ప్రయోగించేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తుండగా దాడి చేశామని ఆయన వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూనే కేవలం ఆత్మరక్షణ కోసమే దాడి చేశామని చెప్పుకొచ్చారు. కాగా జలసంధి సమీపంలో ఉన్న అమెరికా నౌకలు, సిబ్బందిపై ఇరాన్‌ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సేనలు మధ్యలోనే అడ్డుకొని కూల్చివేశాయని తెలిసింది. ఇదిలా వుండగా తమ దేశంపై క్షిపణులు, డ్రోన్ల దాడి జరిగిందని కువైట్‌ తెలియజేసింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో అమెరికా దళాలు జరిపిన దాడికి ప్రతీకారంగానే కువైట్‌లోని అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్‌ దళాలు దాడి చేశాయని తస్నిమ్‌ వార్తా సంస్థ చెప్పింది. అమెరికా దాడుల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని ఇరాన్‌ తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో హార్ముజ్‌ పరిసరాలలో భద్రతపై ఆందోళన తలెత్తుతోంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో అమెరికా జరిపిన దాడులను టెహ్రాన్‌ ఖండించింది. ఈ దాడులు ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు కలిగిస్తాయని మండిపడింది. ఓడరేవు నగరమైన బందర్‌ అబ్బాస్‌లో గురువారం ఉదయం పేలుడు శబ్దాలు వినిపించాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు మూడు పేలుళ్లు సంభవించాయని ఇరాన్‌ మీడియా తెలిపింది. పేలుళ్ల నేపథ్యంలో అనేక నిమిషాల పాటు గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలకం చేశారు. ఈ వారం ప్రారంభంలో కూడా అమెరికా సేనలు దక్షిణ ఇరాక్‌పై దాడులు జరిపిన విషయం తెలిసిందే.

మా ప్రభుత్వాన్ని కూలదోయడమే వారి లక్ష్యం : ఇరాన్‌
ఆర్థిక ఒత్తిడిని పెంచి, మతాలు-జాతుల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా దేశాన్ని విడగొట్టి, విద్రోహ-ఉగ్రవాద చర్యలకు పాల్పడి తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఇరాన్‌ ఇంటెలిజెన్స్‌ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ‘మా దేశాన్ని ముక్కలు చేసి కూలదోయాలన్న లక్ష్యంతో శత్రువులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవలి యుద్ధ ప్రారంభంలోనే వారు బహిరంగంగా ప్రకటించారు. అయితే సైనిక చర్య ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమ య్యారు’ అని ఇంటెలిజెన్స్‌ శాఖ ఓ ప్రకటనలో విమర్శించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అక్రమ కమ్యూనికేషన్‌ సాధనాలు..ముఖ్యంగా స్టార్‌లింక్‌ పరికరాలను పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌ చేయడం కూడా శత్రువుల కుట్రలో భాగమేనని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -