హార్ముజ్‌లో నౌకలను స్వేచ్ఛగా తిరగనివ్వండి : ఐరాస భద్రతా మండలిలో భారత్
న్యూయార్క్ : పశ్చిమాసియాలో తిరిగి ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను ఖండించింది. ఉద్రిక్తలను నివారించాలని, అంతర్జాతీయ జలమార్గంలో నౌకలు స్వేచ్ఛగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించేలా చూడాలని కోరింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితిపై భద్రతా మండలిలో జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి (ఐరాస) పర్వతనేని హరీష్ మంగళవారం ప్రసంగిస్తూ స్వల్ప విరామం తర్వాత తిరిగి శత్రుత్వాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. చర్చలు, దౌత్యానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారత్‌కు పశ్చిమాసియా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని అంటూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. హార్ముజ్‌లో జరిగిన దాడులు భారతీయ పౌరులపై ప్రత్యక్ష ప్రభావం చూపాయని చెప్పారు.
‘ఈ దాడులలో పలువురు భారతీయులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరి ఆచూకీ తెలియడం లేదు. నౌకాయాన సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని జరిపే హింసాత్మక చర్యలను భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. హార్ముజ్ వంటి అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత, సురక్షితమైన నౌకాయానానికి అంతరాయం కల్పించడాన్ని కూడా మేము నిరసిస్తూనే ఉన్నాం’ అని హరీష్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరించబడాలంటే దౌత్యం ఒక్కటే మార్గమని భారత్ గట్టిగా అభిప్రాయపడుతోందని అన్నారు. పశ్చిమాసియాలో భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలను హరీష్ ఈ సందర్భంగా వివరించారు. పాలస్తీనా ప్రజలకు భారత్ మద్దతు కొనసాగుతుందని, రెండు దేశాల పరిష్కారానికి దీర్ఘకాలంగా మద్దతు ఇస్తోందని తెలిపారు.
ఉద్రిక్తతలను నివారించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



