Thursday, July 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనౌకలో చిక్కుకున్న 13 మంది భారత నావికులు

నౌకలో చిక్కుకున్న 13 మంది భారత నావికులు

- Advertisement -


స్పందించని విదేశాంగ శాఖ
కైవ్‌ :
ఉక్రెయిన్‌లోని కీలక అంతర్జాతీయ సముద్ర ఓడరేవు చోర్నోమోర్స్‌ వద్ద ఓ సరకు రవాణా నౌక నిలిచిపోయింది. ఇందులో 13 మంది భారత నావికులు సహా మొత్తం 15 మంది చిక్కుబడిపోయారు. ఈ ఓడరేవు నల్ల సముద్రం యొక్క వాయవ్య తీరంలో ఒడెసా ప్రాంతానికి నైరుతి దిశలో ఉంది. ఓడరేవు సమీపంలో డ్రోన్‌, క్షిపణి దాడులు జరుగుతుండడంతో నౌక అక్కడే ఆగిపోయింది. అందులోని నావికులు భయంకరమైన స్థితిలో ఉన్నారని, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఫార్వర్డ్‌ సీమెన్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌యూఐ) తెలిపింది. నల్ల సముద్రం ఓడరేవు సమీపంలో రష్యా, ఉక్రెయిన్‌ సేనల మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఏ క్షణంలో అయినా తమపై దాడి జరగవచ్చునని వారు ఆందోళన చెందుతున్నారని చెప్పింది. నౌక సమీప ప్రాంతంలో పదే పదే డ్రోన్‌, క్షిపణి దాడులు జరుగుతున్నాయని వివరించింది. సిబ్బంది రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిని క్షేమంగా అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని, నౌక యజమానులను కోరింది.
ఘర్షణలు జరిగే ప్రాంతాలలో భారత నావికులను లక్ష్యంగా చేసుకోకుండా చూడాలని, దీనిపై వెంటనే స్పందించాలని అధికారులకు ఎఫ్‌ఎస్‌యూఐ విజ్ఞప్తి చేసింది. నౌక నుంచి రికార్డు చేసిన వీడియోను కూడా నావికుల యూనియన్‌ షేర్‌ చేసింది. నౌక చుట్టూ పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయని ఆ వీడియోను బట్టి తెలుస్తోంది. ఓడరేవు వద్ద నెలకొన్న అస్థిర భద్రతా పరిస్థితులకు ఈ వీడియో అద్దం పడుతోంది. నౌకలో 13 మంది భారత నావికులు చిక్కుబడి పోయారని వార్తలు వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ కానీ, షిప్పింగ్‌ కంపెనీ కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఉక్రెయిన్‌ దక్షిణ తీరం నుంచి బయలుదేరిన సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇటీవలి కాలంలో దాడులు జరుగుతున్నాయి. రెండు రోజులక్రితమే ఉక్రె యిన్‌ రాయబారి పోలిష్‌చక్‌ను భారత ప్రభుత్వం పిలిపించింది. గతవారం నల్ల సము ద్రంలో సరుకు రవాణా నౌకపై జరిగినదాడిలో భారత నావికుడు మరణించిన ఉదం తంపై తీవ్ర నిరసన తెలియజేసింది. ప్రభుత్వ ఆందోళనను రాయబారికి తెలియజేశామని, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించామని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -