పది మందిపై కేసు, ముగ్గురి అరెస్ట్
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
హైవేలపై నిర్మానుష్య ప్రదేశాల్లో పార్క్ చేసిన భారీ వాణిజ్య వాహనాలను లక్ష్యంగా చేసుకొని చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా మావల మండల పోలీసులు పట్టుకున్నారు. మొత్తం పది మందిపై కేసు నమోదు కాగా.. అందులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో గురువారం మీడియా సమావేశంలో కేసు పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు. బుధవారం రాత్రి మావల బైపాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ప్రయాణిస్తున్న టయోటా కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారును ఆపగా పారిపోయేందుకు అందులో ఉన్నవారు ప్రయత్నించారు. వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి టయోటా, ఎటియోస్ కారు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సలీం, నఫీస్ ఖాన్, ఇంతాజ్ హుస్సేన్‌తోపాటుగా మరో ఏడుగురు ముఠాగా ఏర్పడి.. టయోటా కారులో వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తూ, హైవేలు పెట్రోల్ బంకుల వద్ద పార్క్ చేసిన భారీ వాహనాలను గుర్తించి వాటి తలుపుల గ్లాస్ పగులగొట్టి, స్టీరింగ్ లాక్ విరగదీసి, ఇగ్నిషన్ వైరింగ్ కట్ చేసి వాహనాలను దొంగిలించేవారు. ఈ ముఠా ఐషర్, టిప్పర్ వంటి భారీ వాహనాలను దొంగిలించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు తరలించి విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి పూర్తిగా విడిభాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. వీరిపై గతంలో మావల, గుడిహత్నూర్, శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పట్టుబడిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి.. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన సైబర్ సెల్, సాంకేతిక బృందం, ఆదిలాబాద్ రూరల్, మావల పోలీస్ స్టేషన్, సీసీఎస్, సిబ్బంది మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల సీఐ బిడి ప్రేమ్ కుమార్, డబ్ల్యూపీఎస్ ఇన్స్‌పెక్టర్ కె.ఫణిదర్, రూరల్ ఎస్‌ఐ విష్ణువర్ధన్, ఎస్‌ఐ శ్రీకాంత్, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ గోపికృష్ణ, వన్ టౌన్ పీసీ నరేష్, సైబర్ సెల్ పీసీ త్రిశూల్, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర భారీ వాహనాల దొంగల ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



