వచ్చే ఐదేండ్లు మరింత ప్రమాదకరం
1.5 డిగ్రీ ప్రమాద రేఖ దాటే అవకాశం 75 శాతం
వేడెక్కుతోన్న ఆర్కిటిక్.. అమెజాన్ అడవులకు అగ్ని ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు,
వరదలు, కరువులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం
యూఎన్ హెచ్చరికలు.. పర్యావరణవేత్తల ఆందోళనలు
జెనీవా : ప్రపంచం భరించలేని ఎండలతో తల్లడిల్లుతోంది. ప్రస్తుతం భారత్ కూడా ఇవే పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన వాతావరణ అంచనాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. వచ్చే ఐదేండ్లలో భూమి మరింత వేడెక్కి, చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాల రికార్డులను వరుసగా బద్దలు కొట్టే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించింది. 2026 నుంచి 2030 మధ్య సగటు ప్రపంచ ఉష్ణోగ్రతలు ప్యారిస్ ఒప్పందం నిర్ణయించిన 1.5 డిగ్రీ సెల్సియస్ భద్రతా పరిమితిని దాటే అవకాశం 75 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. అలాగే వచ్చే ఐదేండ్లలో 2024లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం 86 శాతం ఉందని వివరించింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలతో కఠిన పరిస్థితులు
ప్రస్తుతం 1.5 డిగ్రీల పరిమితి
అనేది ఒక్కసారిగా ప్రపంచం కూలిపోయే అత్యంత ప్రమాదకర స్థితి (క్లిఫ్ ఎడ్జ్) కానప్పటికీ.. ప్రతి 0.1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల కూడా
మరింత తీవ్రమైన ప్రభావాలకు కారణమవుతుందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత ప్రాణనష్టం, ఆహార సంక్షోభం, కార్చిచ్చులు, భారీ వరదలు, ప్రమాదకర వేడిగాలులు వంటి కఠిన పరిస్థితులకు ఇదే కారణమవుతుందని అంటున్నారు.
2027లో మరో హీట్ రికార్డు?
ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్ నినో ప్రభావం మళ్లీ బలపడే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రభావం 2028 వరకూ కొనసాగవచ్చని అంచనా. దాంతో 2027 ఏడాది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉందని బ్రిటన్ వాతావరణ శాఖ శాస్త్రవేత్త మెలిస్సా సీబ్రుక్ వివరించారు. ప్రస్తుతం భూమి వేడెక్కే వేగం గతంతో పోలిస్తే మరింత పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశాబ్దంలో సుమారు 0.25 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందనీ, ఇది గత దశాబ్దాల కంటే వేగంగా జరిగే మార్పు అని వారు చెప్తున్నారు.
ఆర్కిటిక్‌లో ప్రమాదకర పరిస్థితులు
భూమిపై మిగతా ప్రాంతాల కంటే ఆర్కిటిక్ ప్రాంతం 3.5 రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదిక వెల్లడించింది. మంచు పర్వతాలు కరుగుతూ ఉండటంతో సూర్య కిరణాలను తిరిగి అంతరిక్షంలోకి పంపే సహజ ప్రతిబింబ వ్యవస్థ బలహీనపడుతోంది. దీంతో మరింత వేడి ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోతోందని వివరించింది. 2020-2025 మధ్య ఆర్కిటిక్ శీతాకాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. కానీ వచ్చే ఐదేండ్లలో అవి సగటున 2.8 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది.
అమెజాన్ అడవులకు మంటల ముప్పు
భూమి ‘గ్రీన్ లంగ్స్’గా పిలవబడే అమెజాన్ అడవులు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. అక్కడ వేడి, పొడి వాతావరణ పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో భారీ అడవి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని వివరించింది. ప్రస్తుతం అమెజాన్ అడవులు వాతావరణంలో ఉన్న ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని భూమిని చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ మంటలు, అడవుల నాశనం పెరిగితే అవే వాతావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఆఫ్రికాలో వరదలు..
ప్రపంచానికి ఆహార మప్పు
ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని నివేదిక వివరిస్తోంది. దీంతో భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశముందని శాస్త్రవేత్తలు అంటున్నారు. “ఇప్పటివరకు మనం అనుభవించని స్థాయి వేడి, వర్షాలు, కరువులు రావచ్చు. నగర ప్రణాళికలు, వ్యవసాయ విధానాలు కూడా ఇలాంటి పరిస్థితులకు సిద్ధంగా లేవు” అని లండన్ ఇంపీరియల్ కాలేజ్ వాతావరణ శాస్త్రవేత్త ఫ్రిడెరికె ఓట్టో వ్యాఖ్యానించారు.
‘బొగ్గు, చమురు వినియోగం
తగ్గకపోతే మరింత ప్రమాదం’
ప్రపంచ దేశాలు వాతావరణ మార్పులను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదని ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం హెచ్చరించింది. బొగ్గు, చమురు, సహజ వాయువు వినియోగం ఇంకా భారీ స్థాయిలో కొనసాగుతుండటమే ప్రధాన కారణమని యూఎన్ వాతావరణ అధికారి సైమన్ స్టీల్ అన్నారు. “ఎండలు, వరదలు, తుఫాన్లు, కార్చిచ్చులు, ఆహార ధరల పెరుగుదల… ఇలా వాతావరణ సంక్షోభానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశమూ ఇప్పటికే భారీ మూల్యం చెల్లిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు తరాల జీవనాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎండలు ప్రజలను ఇప్పటికే చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత్‌తో పాటు పలు దేశాలు, ప్రాంతాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే అసలు ప్రమాదం ఇంకా ముందే ఉందని ఐక్యరాజ్యసమితి (యూఎన్) హెచ్చరిస్తోంది. వచ్చే ఐదేండ్లలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భూమి భగభగ మండిపోనుందని యూఎన్‌కు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) నివేదిక పేర్కొంది. ప్యారిస్ ఒప్పందంలో నిర్ణయించిన 1.5 డిగ్రీల పరిమితిని దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో 2024 రికార్డులూ చెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. వడగాలులు, కరువులు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులు ప్రపంచ జీవనాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే ముప్పు కనిపిస్తోందన్న నివేదిక సమాచారంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



