ఆదాయార్జనలో టీడీపీ టాప్ : ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వివిధ రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల ఆదాయం గతంతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 51.57 శాతం తగ్గినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇందులోని 21 పార్టీలు తాము ప్రకటించిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశాయని తెలిపింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 67 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లోని 36 పార్టీల వార్షిక ఆడిట్ ఖాతాలను ఏడీఆర్ విశ్లేషించింది.
2025 అక్టోబర్ 31 గడువు తేదీ ముగిసిన తర్వాత 207 రోజులు గడిచినా కూడా, మిగిలిన 31 పార్టీలు తమ ఆడిట్ నివేదికలను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచలేదని పేర్కొంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ. 1,192.94 కోట్లుగా నమోదైంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరం ఆదాయంతో (రూ.రూ. 2,463.17 కోట్లు) పోలిస్తే రూ. 1,270.23 కోట్లు తక్కువ. పర్సంటెజీలో చూస్తే 51.57 శాతం తగ్గింది. అయితే, ఈ పార్టీలు ప్రకటించిన మొత్తం ఖర్చు రూ. 1,433.07 కోట్లకు చేరింది. ఇది వాటి మొత్తం ఆదాయం కంటే రూ. 240.12 కోట్లు లేదా సుమారు 20 శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం ఆదాయంలో దాదాపు 69 శాతం వాటా, మొత్తం వ్యయంలో 77 శాతానికి పైగా వాటా కేవలం మొదటి ఐదు పార్టీలదే.
ఆదాయంలో తెలుగుదేశం టాప్..
2024-25 ఆర్థిక సంవత్సరంలో అధిక ఆదాయం పొందిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలిచింది. ఈ పార్టీ రూ. 228.31 కోట్లు ఆదాయాన్ని పొందింది. ప్రాంతీయ పార్టీల పొందిన మొత్తం ఆదాయంలో ఇది 19.14 శాతం. తదుపరి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ. 219.35 కోట్లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రూ.140.39 కోట్ల ఆదాయం పొందాయి. ఖర్చుల పరంగా చూస్తే వైసీపీ అత్యధికంగా రూ. 340.20 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో బిజు జనతాదళ్ (బీజేడీ) రూ. 288.44 కోట్లు, టీఎంసీ రూ. 227.59 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 36 పార్టీల్లో 21 పార్టీలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తాము ఆర్జించిన ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు తెలిపాట్టు వైసీపీ, టీఎంసీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), బీజేడీ, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) సహా పలు పార్టీలు తమ ఆదాయాన్ని మించి ఖర్చు చేశాయి. అదే సమయంలో 15 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయకుండా ఆదా చేశాయి. అత్యధికంగా డబ్బులు ఆదా చేసిన పార్టీగా టీడీపీ నిలిచింది. ఆ పార్టీ రూ.166.98 కోట్లను పొదుపు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) రూ. 36.27 కోట్లు, అన్నాడీఎంకే రూ. 35.86 కోట్లతో నిలిచాయి.
విరాళాలే..ప్రధాన ఆదాయ వనరు
ప్రాంతీయ పార్టీలకు నిధుల సమీకరణలో విరాళాలే ప్రధాన వనరుగా నిలిచాయి. అన్ని పార్టీలకు కలిపి విరాళాలు, చందాల ద్వారా రూ. 702.36 కోట్లు సమకూరాయి. అత్యధిక విరాళాలను పొందిన ప్రాంతీయ పార్టీగా టీఎంసీ (రూ. 184.08 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వైసీపీ (రూ. 140.05 కోట్లు), టీడీపీ (రూ. 85.20 కోట్లు) నిలిచాయి. 15 ప్రాంతీయ పార్టీలు తమ మొత్తం వ్యయంలో 55 శాతానికి పైగా ఎన్నికల ప్రచారం కోసమే ఖర్చు చేశాయి. ఎన్నికల ప్రచారం కోసం అత్యధికంగా ఖర్చు చేసిన వాటిలో వైసీపీ రూ. 299.92 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాతి బీజేడీ (రూ. 270.66 కోట్లు), బీఆర్ఎస్ (రూ.147.99 కోట్ల) నిలిచాయి.
50 శాతం కంటే తక్కువ ఓట్లతోనే గెలుపు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి కూడా ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల్లో సుమారు 40 శాతం మంది తమ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం కంటే తక్కువ ఓట్లను సాధించారని పేర్కొంది. 2026లో జరిగిన బంగాల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 93.7 శాతంగా నమోదైందని, ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 82.3 శాతం కంటే అధికమని తెలిపింది. మొత్తం 175 మంది అభ్యర్థులు (60 శాతం) తమ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించి గెలుపొందారని వెల్లడించింది. 118 మంది అభ్యర్థులు (40 శాతం) సగం కంటే తక్కువ ఓట్లతోనే విజయం సాధించారని స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న 191 మంది విజేతల్లో 121 (63 శాతం) మంది 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఓట్ల వాటాతో విజయం సాధించారు. వీరిలో 107 మంది అభ్యర్థులు ఎటువంటి నేర చరిత్ర లేని (క్లీన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న) సమీప ప్రత్యర్థులపై గెలుపొందారు. దీనికి భిన్నంగా, ఎటువంటి నేర చరిత్ర లేని 102 మంది విజేతల్లో 51 మంది నేర చరిత్ర ఉన్న అభ్యర్థులపై గెలుపొందారు. అదేవిధంగా కోటీశ్వరులైన 179 మంది విజేతల్లో 62 మంది కోటీశ్వరులు కాని సమీప ప్రత్యర్థులపై జయకేతనం ఎగురవేశారు. ఐదు స్థానాల్లో విజేత మెజారిటీ 1,000 ఓట్ల కంటే తక్కువేని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.



