టీజీఐఐసీ వేలంలో సరికొత్త రికార్డు!
83/1 సర్వే నంబర్‌లోని 6.29 ఎకరాలకు భారీ స్పందన
రియల్ ఎస్టేట్ రంగంలో
హాట్ టాపిక్‌గా
రాయదుర్గం ‘పాన్ మక్తా’
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో మరో అద్భుతం నమోదైంది. ఐటీ కారిడార్‌కు గుండెకాయ వంటి రాయదుర్గం ప్రాంతంలో భూమి ధరలు ఊహకందని రీతిలో పలికాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీ-ఐఐసీ) నిర్వహించిన భూవేలానికి అంతర్జాతీయ స్థాయిలో స్పందన లభించింది. ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్ల ధర పలికింది. నగరంలోని రాయదుర్గం పాన్ మక్తా పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాల 29 గుంటల భూమిని విక్రయించేందుకు టీజీఐఐసీ గురువారం వేలం నిర్వహించింది. ఈ వేలంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపర్లు పోటీ పడ్డారు. తీవ్రమైన పోటీ మధ్య బిడ్డింగ్ సాగగా, చివరికి ఎకరా ధర రూ. 237 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే రాయదుర్గం ప్రాంతంలో జరిగిన భూవేలంలో ఎకరా రూ. 177 కోట్లు పలికినప్పుడే అది పెద్ద సంచలనంగా మారింది. తాజాగా జరిగిన వేలంలో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఏడాది కాలంలోనే ఎకరాకు అదనంగా మరో రూ. 60 కోట్లు పెరగడం గమనార్హం. ఈ వేలంలో పలికిన ధరలు చూస్తుంటే రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.



