Saturday, May 30, 2026
E-PAPER
Homeఆటలుడబుల్‌ ధమాకా

డబుల్‌ ధమాకా

- Advertisement -

సురుచికి పసిడి, ఇషాకు సిల్వర్‌
10మీ ఎయిర్‌ పిస్టల్‌లో మనోళ్ల సత్తా
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌

మ్యూనిచ్‌ (జర్మనీ) : ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు డబుల్ ధమాకా. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సురుచి సింగ్‌, ఇషా సింగ్‌లు పసిడి, రజత పతకాలు సాధించారు. జర్మనీలోని మ్యూనిచ్‌ వేదికగా జరుగుతున్న షూటింగ్‌ ప్రపంచకప్‌లో ఇషా సింగ్‌కు ఇది రెండో మెడల్‌ కావటం విశేషం. ఉత్కంఠభరిత పతక పోటీలో సురుచి సింగ్‌ అద్భుతంగా రాణించింది. 242.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు దోహాలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లోనూ పసిడి పతకం సాధించిన సురుచి సింగ్‌కు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో ఇది ఓవరాల్‌గా ఏడో గోల్డ్‌ మెడల్‌. ఈ పసిడి గురితో ఈ ఏడాది డిసెంబర్‌లో ఇటలీలోని రోమ్‌ వేదికగా జరుగునున్న ప్రపంచకప్‌ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. తెలంగాణ తేజం, హైదరాబాదీ ఇషా సింగ్‌ పతక పోటీలో అగ్రస్థానంలో నిలిచిన సురుచి సింగ్‌ కంటే 0.1 పాయింట్‌ వెనుకంజలో నిలిచి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 242.2 పాయింట్లతో ఇషా సింగ్‌ రజత పతకం ముద్దాడింది. 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సాధించిన ఇషా సింగ్‌.. అదే జోరు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లోనూ చూపించింది. దక్షిణ కొరియా షూటర్‌ 220.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. అర్హత రౌండ్‌లో 578 పాయింట్లు సాధించిన సురుచి సింగ్‌, ఇషా సింగ్‌లు వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను భాకర్‌ అర్హత రౌండ్‌లోనే నిరాశపరిచింది. 575 పాయింట్లతో 20వ స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించలేదు. ఇదిలా ఉండగా, పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ విభాగంలో పతక పోరుకు అర్హత సాధించిన ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ సాంకేతిక కారణాలతో ఫైనల్లో పోటీపడలేదు. అర్హత రౌండ్‌లో ఐదో స్థానంలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ ఫైనల్‌ షూటింగ్‌కు సిద్ధమవుతుండగా.. అతడి రైఫిల్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేల్చారు. అర్హత రౌండ్‌లో అదే రైఫిల్‌తో పోటీపడినా, పతక పోటికి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయటంపై భారత అధికారులు అప్పీల్‌కు వెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ ఏడాది కాలంగా ఒకే రైఫిల్‌ వినియోగిస్తున్నాడని అధికారులు తెలిపారు. మ్యూనిచ్‌ ప్రపంచకప్‌ స్కోరు ఆసియా క్రీడల అర్హతకు ప్రామాణికం కావటంతో ఈ అనర్హత ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -