Saturday, May 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఇబ్బందులను సత్వరమే పరిష్కరించండి

మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఇబ్బందులను సత్వరమే పరిష్కరించండి

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా ఫూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ లో సచివాలయంలోని తన ఛాంబర్ లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావనీ, అవి సామాజిక చైతన్యానికి, స్వాభిమానానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీకలని తెలిపారు. ఈ సమావేశంలో దళిత సంఘాల ప్రతినిధులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న స్థల సమస్యలు, అనుమతుల జాప్యం, స్థానిక స్థాయిలో తలెత్తుతున్న అభ్యంతరాలు, పోలీసు అనుమతులు, రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను గ్రామస్థాయి నుంచి యువతలోకి తీసుకెళ్లే ప్రక్రియలో విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విగ్రహాల ప్రతిష్టాపనలో ఎలాంటి అనవసర జాప్యం జరగకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను చట్టబద్ధంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని సూచించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా లేని స్థలాల విషయంలో ముందుగానే సంబంధిత సంఘాలకు స్పష్టమైన నోటీసులు ఇవ్వాలన్నారు. చివరి నిమిషంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, దళిత సంఘాలతో చర్చించి ముందస్తు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు నెలకొంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (వెల్ఫేర్) సభ్యసాచి ఘోష్ తదితర అధికారులు పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -