Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంహీరో నాగ చైతన్యకుఢిల్లీ హైకోర్టు రక్షణ

హీరో నాగ చైతన్యకుఢిల్లీ హైకోర్టు రక్షణ

- Advertisement -

‘పర్సనాలిటి రైట్స్’ పరిరక్షించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నటుడు
పిటిషన్ పై సమాధానం కోరుతూ ప్రతివాదులకు నోటీసులు జారీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ప్రముఖ హీరో అక్కినేని నాగచైతన్య పేరు, చిత్రాలతో టీ-షర్టులను విక్రయించడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నటుడి వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) భంగం కలిగించడాన్ని తప్పుబట్టింది. అలాగే ఆయన వ్యక్తిత్వ హక్కులు కాపాడేలా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత హక్కులు, పబ్లిసిటీ పరిరక్షణ (పర్సనాలిటి రైట్స్)కోసం ఇటీవల హీరో నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయంచారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నటుడి తరఫున సీనియర్ అడ్వకేట్ వైభవ్ గగ్గర్, సర్వోదయ లీగల్, ప్రతివాదుల తరఫున అడ్వకేట్ లు సోమ్ దేవ్ తివారీ, కాష్ దీప్ గుప్తా, సిద్ధార్థ్ సి, అభిషేక్ నాయర్, వంశ్ శ్రీవాస్తవ్ లు హాజరయ్యారు. గగ్గర్ వాదనలు వినిపిస్తూ… ‘నాగ చైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ మెర్చండైజ్ విక్రయాలు, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు దుర్వినియోగం చేస్తున్నాయి. కొన్ని వెబ్ సైట్లు ఆయన పేరును అసభ్య పదాలతో కలిపి సెర్చ్ ఫలితాల్లో చూపించి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అలాగే నటుడి పేరు, పోలికతో అనధికారికంగా ముద్రించిన టీ-షర్టులు, ఇతర వస్తువులను అందిస్తున్నారు.’ అని ఆన్‌లైన్ వస్తువుల జాబితాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మాజీ భార్యతో ఏఐ కంటెంట్…
ఇండియా మార్ట్, నెక్ట్స్ ప్రింట్ లలోని వస్తువుల జాబితాలలో నటుడి చిత్రాన్ని అనుమతి లేకుండా ప్రదర్శించారని కోర్టుకు నివేదించారు. అలాగే నటుడిని అతని మాజీ భార్యతో కలిపి చూపిస్తోన్న ఏఐ రూపొందించిన యూట్యూట్ కంటెంట్, అవాస్తవాలు, పరువు నష్టం కలిగించే యూట్యూబ్ వీడియోలను కూడా ఆయన ప్రస్తావిం చారు. పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్లు, హోస్టింగ్ సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, వ్యాపార లిస్టింగ్ సైట్లు, గూగుల్, యూ ట్యూబ్ వంటి మధ్యవర్తి సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. మరోవైపు ఇండియా మార్ట్ తరఫున అడ్వకేట్ జోక్యం చేసుకొని.. వివాదస్పద జాబితాలను తొలగించే సామర్థ్యం తమకు ఫ్లాట్ ఫాంలకు ఉందని తెలిపారు. అయితే ఆ జాబితాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మరోసారి గగ్గర్ స్పందిస్తూ… కొన్ని అక్రమ మెర్చండైజ్ లిస్టింగ్‌లు లీగల్ నోటీసుల తర్వాత తొలగించినా, సంబంధిత లింకులు, ప్రకటనలు ఇంకా ఇంటర్నెట్‌లో ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఒక వెబ్‌సైట్ లో కంటెంట్ తొలగించిన తర్వాత కొత్త యూఆర్ఎల్ లు, వెబ్‌సైట్లు మళ్లీ వస్తున్నందున డైనమిక్ ఇన్ జక్షన్ ఆర్డర్ ఇవ్వాలని నటుడి తరఫున అభ్యర్థించారు. దీంతో నటుడి పిటిషన్ పై సమాధానాలు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -