Saturday, May 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలి

మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలి

- Advertisement -

వారి ప్రతిభకు వేదికగా ఇంక్యుబేటర్ కేంద్రాలు : 
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభం

నవతెలంగాణ-బంజారాహిల్స్
మహిళలు ఉద్యోగం వెతికే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలని, గ్రామీణ మహిళల ప్రతిభ, ఆలోచనలు, వ్యాపార కలలకు బలమైన వేదికగా ఇంక్యుబేటర్‌ ‌కేంద్రాలు నిలుస్తాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మహిళల చేతుల్లో బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలని ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కొమరంభీం ఆదివాసీ భవన్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “ మేడ్‌ ఇన్‌ ‌తెలంగాణ.. మేడ్‌ ‌బై ఉమెన్‌” అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని ఆకాంక్షించారు. దేశంలోని అగ్రశ్రేణి ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ టీ హబ్‌‌తోపాటు బిట్స్‌ పిలానీ భాగస్వామ్యంతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి ఇంక్యుబేటర్‌కూ రూ.10.70 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ట్రైనింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, డిజిటల్ సపోర్ట్‌, ఫైనాన్షియల్ గైడెన్స్‌, బిజినెస్ మెంటారింగ్ వంటి సేవలు అందించనున్నట్టు చెప్పారు. తొలి దశలో 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

తెలంగాణలో ప్రస్తుతం 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారని, వారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు. వారి వ్యాపారాల విస్తరణ కోసం ప్రత్యేక ఎస్‌‌హెచ్‌‌జీ యాప్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. మహిళా సంఘాలు 100 శాతం రీపేమెంట్ చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. మేడారం జాతర సందర్భంగా మహిళలు భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చేర్యాల మహిళలు తయారు చేసిన చింతగింజల మాస్క్‌లు నెదర్లాండ్స్ వరకు ఎగుమతి కావడం తెలంగాణ మహిళల సృజనాత్మకతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈఆర్‌‌పీ సీఈఓ దివ్య దేవరాజన్‌, వీ-హబ్‌ సీఈఓ సీత పల్లచోల‌, టీ హబ్‌ సీఈఓ కవికృత్‌, ఎస్‌ఈఆర్‌‌పీ నాన్‌ఫామ్ డైరెక్టర్ జాన్సన్‌, డీఆర్‌‌డీఓ ప్రతినిధులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -