Saturday, May 30, 2026
E-PAPER
Homeమానవికీళ్లనొప్పులా..?

కీళ్లనొప్పులా..?

- Advertisement -

నలభయ్యేండ్లు పైబడ్డ మహిళల్లో కీళ్లనొప్పులు సాధారణమయ్యాయి. ఇంకాస్త వయసు మీద పడితే మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుంటారు. ఇంకొంతమందికి మోకాలి ఆపరేషన్లు కూడా అవసరమవుతున్నాయి. చాలామంది దీనిని కేవలం ‘వయస్సు పైబడుతోంది’ అని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. సాధారణ అరుగుదలతో పాటు శరీరంలో హార్మోన్ల మార్పులు, నిర్మాణపరమైన మార్పులు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మహిళల్లో కీళ్లు నొప్పులు ఎందుకు వస్తాయే తెలుసుకుందాం..

సాధారణంగా మహిళల్లో 40- 45 ఏండ్ల తర్వాత హార్మోన్ల సమతుల్యతలో మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా పెరిమెనోపాజ్, మెనోపాజ్ తర్వాత హార్మోన్ల అసమతుల్యత కీళ్ల నొప్పులకు దారితీయడానికి.. మన శరీరంలో జరిగే జీవక్రియల మార్పులే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. కీళ్ల లోపల ఉండే వ్యవస్థపై హార్మోన్లు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ చూపించే ప్రభావం తగ్గడం వల్ల ఈ నొప్పి మొదలవుతుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపిస్తుందని నేచర్‌ ‌జనరల్‌ పేర్కొంది.ఈస్ట్రోజెన్ తగ్గడం: మన శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఒక సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కారకంగా పని చేస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు సమృద్ధిగా ఉన్నంత కాలం అది కీళ్ల కణజాలాలలో వాపు రాకుండా రక్షిస్తుంది. కానీ 40 ఏండ్లు దాటాక ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల, కీళ్ల చుట్టూ ఉండే పొరలు సులభంగా వాపునకు గురై నొప్పులు మొదలవుతాయని పేర్కొంటున్నారు. కీలు సమతుల్యతను కాపాడుకోవడంలో ఈస్ట్రోజెన్లు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నేషనల్‌ ‌లైబ్రరీ ఆఫ్‌ ‌మెడిసెన్‌ పేర్కొంది.

ఆస్టియో ఆర్థరైటిస్: 45 ఏండ్లు పైబడిన మహిళల్లో ప్రారంభ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న ఒక కీళ్ల సమస్య. ఇది కీళ్ల కార్టిలేజ్ (మృదులాస్థి) క్రమంగా అరిగిపోయే పరిస్థితి అని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి, మోకాళ్లలో కటకట శబ్దాలు రావడం, ఉదయం పూట కీళ్లు బిగుతుగా ఉండటం, పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఈ క్రమంలో కీలు స్వల్పంగా అరిగిపోయినా వెంటనే నొప్పి వస్తుంది. కానీ, చాలామంది ఈ నొప్పిని బలహీనత లేదా క్యాల్షియం లోపం అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. క్యాల్షియం, విటమిన్ డి: మహిళలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి, క్యాల్షియం లోపాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో క్యాల్షియం లోపం ఎముకలను బలహీనపరుస్తుందని, విటమిన్ డి లోపం క్యాల్షియం గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. ఈ రెండు లోపాల కారణంగా కార్టిలేజ్ కింద ఉన్న ఎముకను బలహీనపరుస్తుంది. దీనివల్ల నడుస్తున్నప్పుడు మోకాలి నొప్పి, అలసట పెరుగుతుందని తెలియజేస్తున్నారు. బరువు పెరగడం: 40 ఏండ్ల తర్వాత జీవక్రియ మందగించడం వల్ల మహిళలు బరువు పెరుగుతారు. దీనివల్ల నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు మోకాలి కీలు శరీర బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ బరువును మోస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫలితంగా, ప్రతి అదనపు కిలో బరువు కార్టిలేజ్ దెబ్బతినడాన్ని వేగవంతం చేస్తుందని వెల్లడిస్తున్నారు. అధిక బరువు మోకాలు వంటి కీళ్లపై పడే భారాన్ని పెంచుతుందని, ఇది ఒత్తిడిని పెంచి, మృదులాస్థి క్షీణతను వేగవంతం చేసే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పని ఒత్తిడి : మహిళలు తరచుగా నేలపై కూర్చోవడం, వంగడం, మెట్లు ఎక్కడం వంటివి చేస్తుంటారు. ఈ పనులు దశాబ్దాల తరబడి మోకాలి కీలుపై పదేపదే ఒత్తిడిని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. దీని ప్రభావం 45 ఏండ్ల తర్వాత కనిపిస్తుందని చెబుతున్నారు. ఎలా నివారించాలి : క్రమం తప్పకుండా నడవడం, బరువు నియంత్రణ, విటమిన్ డి కోసం ఎండలో కొద్దిసేపు నిలబడటం, ఎముకల బలానికి పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు తీసుకోవడం, తొడ కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవద్దు. ప్రతి గంటకు ఒకసారి లేచి 5 నిమిషాల అటు ఇటు నడవాలి. కార్బోహైడ్రేట్లు తగ్గించి, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. చక్కెర, మైదా, వేపుళ్లు, ప్యాక్ చేసిన జంక్​ఫుడ్​ను పూర్తిగా తగ్గించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -