స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకాలు
వామపక్షాలను బలహీనపర్చేందుకు బీజేపీ, కార్పొరేట్ల కుట్ర
విద్వేషాలు, విభజన రాజకీయాలు ఎల్లకాలం సాగవు
బీజేపీపై క్రమంగా తొలుగుతున్న భ్రమలు
రాజకీయాల వైపు యువతరం చూపు
సోషల్‌మీడియా కట్టడికి కార్పొరేట్ సంస్థల యత్నం
నాగేశ్వర్‌పై నిర్బంధం సరిగాదు
నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ల ప్రయోజనాలకు, బీజేపీ హిందూత్వ ఎజెండాకు అడ్డొస్తున్నందుకే వామపక్షాలపై దాడి జేపీ, ఆర్‌ఎస్‌ఎస్ 2024 ఎన్నికల్లో అనుకున్నవి సాధించలేకపోయాయి. దీంతో రాజ్యాంగాన్ని, ఎన్నికల వ్యవస్థలను మరింత లోతుగా దెబ్బతీయాలని బీజేపీ నిర్ణయించుకున్నది. హిందూత్వ ఎజెండాతో రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చాలనే బీజేపీ లక్ష్యానికి, దేశ వనరులు కొల్లగొడుతున్న కార్పొరేట్లకు వామపక్షాలు ప్రధాన ఆటంకంగా మారాయి. కార్పొరేట్లతో పూర్తిగా పెనవేసుకుపోయిన బీజేపీ ప్రభుత్వం వారి మేలు కోసం వామపక్షాల మీద దాడిని మొదలుపెట్టింది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల మీద సైనిక యంత్రాంగాన్ని రంగంలోకి దింపి నిర్మూలనా దాడిని తీవ్రం చేసింది. ఇప్పుడు చత్తీస్‌ఘడ్‌లోని విలువైన ఖనిజ వనరులున్న అడవులను, భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్న తీరును కండ్లారా చూస్తున్నాం. మతోన్మాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణకు గట్టిగా నిలబడుతున్న వామపక్షాలను పూర్తిగా తూడ్చిపెడితే తప్ప కార్పొరేట్లకు ఊరట ఉండదన్న బీజేపీ ఆలోచనలకు నాందే విజయన్‌పై ఈడీ దాడి.
విమర్శించేవారిని, ప్రశ్నించేవారిని భయపెట్టడం, వెనక్కికొట్టడం బీజేపీకి కొత్తేం కాదు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేసి జైలు పాలు చేసింది. విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులను వేధించింది. నిర్బంధించింది. ఈ పరిణామాలు రాబోయే కాలంలో తీవ్రమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ద్వారా సర్, డీలిమిటేషన్, ఇంకా అనేక పద్ధతులను వినియోగించి ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేకుండా ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. లౌకిక, రాజకీయ పార్టీలను బలహీనం చేయడానికి పనిచేస్తున్నది. రాజ్యాంగాన్ని సవరించి లౌకిక పునాదిని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నది. దొడ్డిదోవన డీలిమిటేషన్ కోసం పార్లమెంట్‌లో చట్టం చేయడానికి చేసిన ప్రయత్నం తాజా ఉదహరణ. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉండటంతో బీజేపీ అనుకున్నది సాధించలేకపోయింది. ఆ ప్రయత్నాన్ని మాత్రం వదల్లేదు. ప్రతిపక్ష ఎంపీలను భయపెట్టి, లొంగదీసుకుని రాజ్యసభలో బలం పెంచుకునే పనిలో ఉంది. దాన్ని నిరోధించేందుకు లౌకిక ప్రజా ఉద్యమ అవసరముంది.
పెరుగుతున్న ప్రజా ఉద్యమాలు..
బీజేపీపై తగ్గుతున్న భ్రమలు
ప్రజా ఉద్యమాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ పోరాటాల్లో వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సీపీఐ(ఎం) ముందువరుసలో ఉంటున్నాయి. కార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద సమ్మెలను నిర్వహించాయి. రైతాంగం మద్దతు ధర కోసం దీర్ఘకాలిక పోరాటం చేసింది. ఆ పోరాటాల ఫలితం గత లోక్ సభ ఎన్నికల్లో కనబడింది. పార్లమెంట్‌లో గతం కన్నా ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. ఈ ప్రక్రియలో వామపక్షాలు సాపేక్షంగా తమ బలాన్ని పెంచుకోలేక పోయాయనేది వాస్తవం. పోరాటాల్లో ప్రజల తరఫున ఉన్నా అవి ఓట్లరీత్యా రాజకీయ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకోలేక పోయామనేది కూడా నిజమే. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది ప్రతిబింబించింది. దీనికి చాలా కారణాలున్నాయి. బీజేపీ మీడియా శక్తిని దుర్వినియోగం చేస్తూ, కుల, మత విద్వేషాలు, చీలికలను ప్రోత్సహిస్తూ ప్రజలను విభజించి లబ్ది పొందుతున్నది. ఇది ఎల్లకాలం ఉండదు. బీజేపీపై ప్రజల్లో ఉన్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి.
రాజకీయాలపై యువతరం దృష్టి
ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగానూ, మనదేశంలోనూ యువత రాజకీయంగా కీలక భూమిక పోషిస్తున్నది. నేపాల్లో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దింపి రాజకీయ సంచలనాన్ని సృష్టించింది. అంతకుముందు శ్రీలంక ఎన్నికల్లోనూ అదే పరిణామం కనిపించింది. బంగ్లాదేశ్‌లోనూ యువత రోడ్లెక్కి రాజకీయ మార్పునకు నాంది పలికింది. మనదేశంలో తమిళనాడులో విజయ్ ప్రభుత్వం రావడానికి యువత కీలక పాత్ర పోషించందనే చర్చ నడుస్తున్నది. ఇవన్నీ చూసినప్పడు ప్రపంచవ్యాప్తంగా యువతరం రాజకీయంగా చైతన్యమవుతున్నదనే విషయం విదితమవుతున్నది. యువత రాజకీయ రహితంగా ఉన్నదనేది వాస్తవం కాదు. సోషల్‌మీడియాలో యువకులు రాజకీయ ఆలోచన చేస్తున్నారు. ఈ మధ్య సోషల్‌మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి లక్షల మంది అనుయాయులుగా ఉన్నట్టు తేలింది. అవినీతికి వ్యతిరేకంగా, అభివృద్ధి కోసం, లౌకిక విలువల పరిరక్షణ కోసం, చాంధసభావాలను తిరస్కరించే గుణం యువకుల్లో బలంగానే వ్యాపిస్తున్నది. అయితే, యువతలో వస్తున్న ఈ మార్పు పూర్తిగా అభివృద్ధి నిరోధక శక్తులకు అడ్డుకట్ట వేయగలుగుతుందని భావించలేం. ఒక సామాజిక మార్పునకు నాందిగా యువకుల ఉత్సాహం తోడ్పడుతుంది. అయితే, ఆ ఆవేశం కొంత చల్లారాక అభివృద్ధి నిరోధక శక్తులు ఆ యువ శక్తినే ఉపయోగించుకుని ముందుకు పోతున్న పరిస్థితి ఉంది.
బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో అదే జరుగుతున్నది. నేపాల్‌లో కార్మికుల హక్కులను బలహీనం చేస్తూ నిర్ణయం కొత్త ప్రభుత్వం తీసుకున్నది. యవకుల పోరాటం ఫలితంగా వస్తున్న మార్పు ఎటువైపు వెళ్తుందనే విషయాన్ని పరిశీలించాలి. అభ్యుదయ మార్గం వైపు అన్నిచోట్ల ప్రయాణిస్తుందని అనుకోలేం. వామపక్షాలు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ మార్పు అభ్యుదయం దిశగా ముందుకెళ్తున్నది. వామపక్షాలు బలంగా లేని, జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉన్న చోట్ల అది అటు ఇటు చెదిరిపోతున్నది. యువకులను అభ్యుదయ, వామపక్షాల రాజకీయాల వైపు ఆకర్షించలేకపోతున్నామనే చర్చ వామపక్షపార్టీల్లోనూ, సీపీఐ(ఎం)లోనూ జరుగుతున్నది. యువకులు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు అభ్యుదయం వైపు మళ్లించేందుకు కొత్తతరంలో వస్తున్న మార్పులను, లక్ష్యాలను గమనించి వామపక్షాలు తమ కార్యాచరణ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నం జరుగుతున్నది.
మీడియాపై కార్పొరేట్ల పట్టు
ప్రపంచంలో ఆధునీకరణ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగేకొద్దీ మీడియాపై కార్పొరేట్ల పట్టు అంత పెరుగుతున్నది. ఖర్చుతో కూడుకున్న ఆధునిక మీడియాను పెట్టుబడి ద్వారా కార్పొరేట్లు సులభంగా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, డిజిటల్, సోషల్‌మీడియా వేదికలపై స్వేచ్ఛగా భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే వెసులుబాటు ఉన్నది. మార్పును కోరుకునే శక్తులు దాన్ని వినియోగించుకుంటున్నాయి. దాన్ని నియంత్రించేందుకు ఇంటర్నెట్‌ను శాసించే శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఎక్స్, ఫేస్‌బుక్, తదితర సంస్థలు మార్పును కోరుకునే శక్తులను నిరోధించే ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ దాడి మరింత పెరుగుతుంది. చానల్స్‌ను రద్దుచేస్తున్నాయి. సోషల్‌మీడియాను అభ్యుదయ శక్తుల కంటే అభివృద్ధి నిరోధక శక్తులే ఎక్కువగా వాడుకుంటున్నాయి. వామపక్ష శక్తులు దీంట్లో వెనుకబడి ఉన్నాయి. తమ కార్యక్రమాన్ని, అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి కొంత మేరకు సోషల్‌మీడియా సాధనంగా ఉపయోగపడుతున్నప్పటికీ మొత్తంగా చూస్తే భావజాల వ్యక్తీకరణ ఆశించిన స్థాయిలో జరగట్లేదు. దాన్ని అధిగమించే ప్రయత్నాలను వామపక్షాలు మొదలుపెట్టాయి. ఈ మధ్య అనేక మంది పోర్టల్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ మధ్య లెఫ్ట్ వ్యూస్ అని న్యూస్‌పోర్టల్ ప్రారంభించాం. ఇవన్నీ క్రమంగా పుంజుకునే అవకాశముంది.
ధాన్యం సేకరణ నుంచి
తప్పుకునే పనిలో కేంద్రం
దేశంలో ధాన్యం సేకరణ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. కేంద్రం ఎఫ్‌సీఐ, తదితర సంస్థల ద్వారా సేకరించాలి. కానీ, వాటిని నిర్వీర్యం చేయాలని మోడీ సర్కారు చూస్తున్నది. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటంలో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలన్నదే ప్రధాన డిమాండ్. వాస్తవంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమ్‌ఎస్‌పీ రైతులకు దక్కడం లేదు. వ్యాపారస్తులు తక్కువ చేసి కొంటున్నారు. ఎగుమతులు విస్తారంగా జరిగితే తప్ప ఎమ్‌ఎస్‌పీ దక్కడం లేదు. వర్షం వస్తే ధాన్యం నిల్వ చేసుకునే కనీస ఏర్పాట్లను పాలకులు విస్మరించారు. ఇందులో ఆయా రాష్ర్ట ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పుకోవాలని చూసింది. తీవ్ర ప్రతిఘటన రావడంతోని తాత్కాలికంగా వెనకడుగు వేసింది. కానీ, క్రమంగా నిర్వీర్యం చేస్తున్నది. భూసారాన్ని కాపాడటానికి ఎరువులను తగ్గిస్తున్నామని పాలకులు చెబుతున్నారు.
వాస్తవం అది మాత్రమే కాదు. ఎరువులు, విత్తనాలపై ఇస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలని ఐఎమ్‌ఎఫ్, వరల్డ్ బ్యాంకు, అమెరికా ఒత్తిడి ఉంది. అదే సమయంలో లాభసాటిగా ఉన్న వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర కూడా దాని వెనుక దాగి ఉంది. వాటిని ఎత్తేయడానికి ఒక సాధనం కావాలి. అందుకే ఎరువుల వాడకాన్ని తగ్గించాలనే పల్లవి ఎత్తుకున్నారు. నూటికి 80 శాతం ఎరువులు దిగుమతుల ఆధారితమే. రూపాయి విలువ పడిపోయినప్పడు కొనుగోలు చేయడం కష్టమవుతున్నది. విదేశీ మారకద్రవ్య నిలువలు కార్పొరేట్లకు ఉపయోగపడాలి తప్ప రైతులకు కాదు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. రైతులు ఎరువుల డిమాండ్ తగ్గించుకుంటూ పోతే అది కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చుతుంది. అందులో భాగంగానే ఎరువులు వాడొద్దు, నానో యూరియాను వాడండి అనే ప్రచారాన్ని తెరమీదికి తీసుకొస్తున్నరు. దీని వెనుక సబ్సిడీల నుంచి వైదొలగడమనే అంశముంది. డీజిల్, పెట్రోల్ రేట్లు రోజూ పెంచినట్టుగానే ఎరువుల ధరలను రాబోయే కాలంలో పెంచే ప్రమాదముంది. యుద్ధం మీద నెపం పెట్టి తప్పించుకునే పనిలో మోడీ సర్కారు ఉంది.
తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అవసరం
12 ఏండ్ల తెలంగాణలో అభివృద్ధి హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. నిర్ధిష్ట లక్ష్యాలను పెట్టుకుని అభివృద్ధి చేయడానికి తగినంత ప్రయత్నం ఇప్పటికీ జరగలేదు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అవసరం. అన్ని రాష్ర్టాల్లో వచ్చిన మార్పు కొనసాగింపు జరిగింది తప్ప ప్రత్యేకంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనలో అదనంగా వచ్చిందేమీ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు, ఆనాడు ఉద్యమంలో పాలుపంచుకున్నవాళ్లు తాము ఆశించింది జరగలేదనే నిరాశలో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధే కాదు. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని పలు ప్యాకెట్లలో తీవ్ర వెనుకబాటు తనం ఉంది. కొన్ని ప్యాకెట్లలో గిరిజనులు కేంద్రీకృతమై ఉన్నారు. అక్కడ వెనుకబాటుతనం నేటికీ కనిపిస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాల విషయంలో, అక్షరాస్యత విషయంలో ఆ రోజు ఏ స్థాయిలో ఉన్నామో ఈ రోజూ అదే స్థాయిలోనే ఉన్నాం. అప్పుడూ, ఇప్పుడూ బోర్లపైనే వ్యవసాయం నడుస్తున్నది. కాళేశ్వరం ఏ మేరకు ఉపయోగపడుతున్నదో ప్రజలకే తెలుసు. బడ్జెట్‌లో నిధులు పెంచుకుంటూ పోవడం తప్ప వచ్చిన మార్పేమీ లేదు. ధనవంతులు కోటీశ్వర్లు అయ్యారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల అనుయాయులు కొంత మేరకు సంపన్నులయ్యారు. ఇప్పుడు వారు ఆయా పార్టీల వెనుక చేరి రాజకీయాలను శాసిస్తున్నారు. ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.
స్వతంత్ర విదేశాంగ
విధానానికి తిలోదకాలు
బీజేపీ లౌకిక వ్యవస్థను నాశనం చేయడమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కూడా వదిలేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం విషయంలో ఇది స్పష్టమైంది. చిరకాల మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌కు అండగా నిలబడలేదు. దుర్మార్గంగా దాడి చేస్తున్న అమెరికా, ఇజ్రాయిల్‌లకు వత్తాసు పలికింది. ఈ యుద్ధ ప్రభావం మన దేశం మీద తీవ్రంగా ఉంది. క్రూడాయిల్ ఉప ఉత్పత్తులు, ఎరువులు, గ్యాస్ దిగుమతులను ఎక్కువగా రష్యా, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. అమెరికా ఆదేశాలతో ఇరాన్, రష్యాల నుంచి కొనుగోళ్లను తగ్గించేసింది. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. పది రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.8 చొప్పున పెరిగాయి. దీనివల్ల నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎరువుల కొరతతో మన ఆహార భద్రతకు ప్రమాదం పొంచి ఉంది. మన దేశ జీడీపీ ఒకటి నుంచి 1.5 శాతం మేర పడిపోయే ప్రమాదముందనీ, నిరుద్యోగం భారీగా పెరగబోతున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోడీ అలీన విధానాన్ని వదిలేసి పొదుపు మంత్రం జపిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి స్థాయి అంతంతే ఉన్నప్పుడు పొదుపు ఎలా పాటిస్తారు? ప్రజలు పస్తులుండాలని మోడీ చెబుతున్నట్టు ఉంది. ఇరాన్‌పై అమెరికా దిగ్బంధం ఆగిపోనంత వరకు ఈ సంక్షోభం తొలగదు. మోడీకి దేశభక్తి కంటే ట్రంప్ భక్తే ఎక్కువ అన్నట్టుగా మారింది.
ములాఖాత్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై నిర్బంధం సరిగాదు
నాగేశ్వర్ ఒక ప్రొఫెసర్. మేధావి. జర్నలిస్టు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర పరిణామాలపై విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాలక, ప్రతిపక్షాలు అనే నిమిత్తం లేకుండా అంశాన్ని అబ్జెక్టివ్‌గా విశ్లేషణ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి మాటలకు విలువ ఉంటుంది. ఆయన వ్యాఖ్యానాలు పలు సందర్భాల్లో అధికార పార్టీలకు చురుకుగా తాకుతాయి. ఆ పార్టీలు విమర్శలను స్వీకరించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నచ్చకపోతే ప్రతి విమర్శలు చేయవచ్చు. తిరస్కరించవచ్చు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించాలని చూడటం మాత్రం సరిగాదు. ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వం చలామణిలో ఉంది. బీజేపీ ఆడించినట్టు ఆ ప్రభుత్వం ఆడుతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే నిరంకుశ విధానాన్ని బీజేపీ పెంచి పోషిస్తుందో దానిలో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు చూడాలి. నాగేశ్వర్‌పై నిర్బంధం సరిగాదు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగానే నాగేశ్వర్‌కు అండగా నిలుస్తున్నాం.
‘మోడీది దేశభక్తి కాదు. ట్రంప్ భక్తి. అమెరికా ఒత్తిడితో స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకాలిచ్చారు. రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోలును నిలిపివేసింది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లు, నిత్యావసర ధరల పెరుగుదలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవేమీ మోడీకి పట్టడం లేదు. పైగా, పొదుపు మంత్రం జపిస్తున్నారు. ప్రజల కొనుగోలు స్థాయి పడిపోయి తిండికి ఇబ్బందులు పడుతుంటే పొదుపు జపం ఏంది? అంటే ప్రజలకు పస్తులుండాలని ప్రధాని సంకేతాలిస్తున్నారా? ఇది దారుణం. మతం, కులం, ప్రాంతం పేరుతో జరిగే విద్వేష, విభజన రాజకీయాలు ఎల్లకాలం సాగవు. ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీపై భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. యువతరం రాజకీయాల వైపు చూస్తోంది. అయితే, ఆ శక్తి అభివృద్ధి నిరోధక, కార్పొరేట్ల శక్తుల చేతుల్లో బంధీ కాకుండా అభ్యుదయం వైపు నడవాలి. ఆ దిశగా వామపక్ష పార్టీల కృషి మొదలైంది. అయితే, కార్పొరేట్ల లాభాలకు, హిందూత్వ ఎజెండాలకు ప్రధాన ఆటంకంగా ఉన్న వామపక్ష పార్టీలపై రాజకీయదాడి తీవ్రమైంది. దాన్ని తిప్పికొట్టేందుకు వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలు బలపడాల్సిన అవసరముంది.’ అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు చెప్పారు. నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…



