Sunday, May 31, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉచిత విద్యుత్‌ ఎత్తేయం మోటార్లకు మీటర్లు పెట్టం

ఉచిత విద్యుత్‌ ఎత్తేయం మోటార్లకు మీటర్లు పెట్టం

- Advertisement -

‌అబద్ధాల పునాదుల మీద బతుకుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌
చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది
కేంద్రం కొనకుంటే 15 తర్వాత మోడీ, కిషన్‌‌రెడ్డి సంగతి చెప్తా

అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల్లో పోటీ చేయం
మేం మాట మీద నిలబడితే బీఆర్‌ఎస్‌ పోటీ చేయకుండా ఉంటుందా?
24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ రైతు డిస్కం లక్ష్యం
ధాన్యాన్ని వారి ఇండ్ల ముందే పోస్తాం :
మీడియాతో చిట్‌‌చాట్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఉచిత విద్యుత్‌ ఎత్తేయం… మోటార్లకు మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా తాము వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చిచెప్పారు. ఒకవేళ మోటార్లకు మీటర్లు పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ కొనసాగించినా వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్‌ఎస్ తప్పుకుంటుందా?అని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌‌లోని బోధి పెవిలియన్‌‌లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గతంలో రాష్ర్టంలోని ఉత్తర, దక్ష‍ిణ డిస్కంలు జాతీయ ర్యాంకుల్లో మూడు, ఆరు స్థానాల్లో ఉండేవని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఆర్థిక క్రమశిక్ష‍ణ లోపించడంతో 52, 54 స్థానాలకు పడిపోయాయని ఉదహరించారు. రెండు డిస్కంలు రూ.69,741 కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ అమలు చేశాక ప్రభుత్వాలు డిస్కంలకు నిధులు ఇవ్వట్లేదన్నారు. అందుకే దేశంలోనే మొదటిసారిగా రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనివల్ల జవాబుదారీతనంతో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌‌ను అందించడమే లక్ష్యమని ప్రకటించారు. క్రాస్‌ ‌సబ్సిడీ ఇచ్చే 30 లక్ష‍ల వ్యవసాయ పంపుసెట్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు, మిషన్‌ ‌భగీరథ, మెట్రో వాటర్‌ ‌వర్క్స్‌వాటిని ఈ డిస్కం పరిధిలోకి తెస్తామన్నారు. అయితే రాత్రిపూట వ్యవసాయం చేసేది తక్కువ అనీ, ఉదయం పూటే ఎక్కువ మంది రైతులు విద్యుత్‌‌ను వాడుకుంటారని చెప్పారు. ఉదయం వేళల్లో తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని వివరించారు.

2017 జూన్‌ 30‌న కేంద్ర ప్రభుత్వంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్మార్ట్‌ ‌మీటర్లను పెట్టేందుకు ఒప్పందం చేసుకుందని ‌గుర్తుచేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతుల వద్ద మార్కులను కొట్టేయాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ ‌మోటార్లు…మీటర్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. తాము ఇప్పుడు కొత్తగా కేంద్రంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టంచేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌పేటెంట్‌ అని అన్నారు. రాజ్యాంగం, చట్టాలున్నా ఎస్సీ కమిషన్‌, ఎస్టీ కమిషన్‌, మహిళా కమిషన్‌ ఎలా ఉన్నాయో రైతుల కోసం కొత్త డిస్కం కూడా అలాగే ఉండబోతుందని వివరించారు. ఈఆర్సీ అనుమతి ఇవ్వగానే రైతు డిస్కం ఏర్పాటవుతుందని చెప్పారు. చత్తీస్‌‌ఘడ్‌ ‌నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ‌కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుని రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ ‌కొనుగోలు చేసినట్టు గత ప్రభుత్వం చెప్పిందనీ, ఇలాంటి అక్రమాలు, అడ్డగోలు నిర్ణయాలపై తాము సీబీఐ విచారణకు ఆదేశించామని తెలిపారు. దీనికోసం సీబీఐ డైరెక్టర్‌ అపాయింట్‌‌మెంట్‌ అడిగామనీ, ఆయన ఇవ్వట్లేదని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ ‌డీఎన్‌ఏలోనే మోసం
బీఆర్‌ఎస్‌ ‌డీఎన్‌ఏలోనే మోసం, అబద్ధం ఉన్నాయని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, అధికారంలోకి వచ్చాక ఆ అబద్ధాలతోనే ఆ పార్టీ నాయకులు కొనసాగారని విమర్శించారు. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఏం చేయాలో అర్థంకాక ఇప్పుడు బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతున్నారనీ, క్రషర్లను బెదిరిస్తూ, రూ.50 లక్ష‍లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమంలో, పదేండ్లు అధికారంలో ఉండి దోచుకున్నారని చెప్పారు. ఈదురుకుంట చెరువు గురించి కేటీఆర్‌, హరీశ్‌‌రావు, నవీన్‌రావు మాట్లాడ్డం లేదన్నారు. గ్లోబరీనా కేటీఆర్‌ ‌బినామీ సంస్థ అనీ, 2019 ఇంటర్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై తాను పోరాడానని గుర్తు చేశారు.

కేంద్రం ధాన్యం ఎలా కొనదో చూస్తా..
వడ్లను తాము కొంటున్నది ఎంత, కేంద్రం కొంటున్నది ఎంతో కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి లెక్కలు తేల్చాలని సీఎం రేవంత్‌‌రెడ్డి నిలదీశారు. వడ్లు, మొక్కజొన్న, జొన్నలకు మద్దతు ధర నిర్ణయిస్తే సరిపోదనీ, కొనుగోలు చేయాలని చెప్పారు. పంజాబ్‌‌కు 86 శాతం, చత్తీస్‌‌ఘడ్‌‌కు 68 శాతం, హర్యానాకు 65 శాతం ధాన్యం కొనుగోలు చేసి, తెలంగాణ నుంచి కేవలం 38 శాతం కొనాలని నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున వడ్లు, మొక్కజొన్న, జొన్నలు మొత్తం కొంటామనీ, వాటిని తిరిగి కేంద్రం కొనకుంటే ఈనెల 15 తర్వాత ఆ సంగతేందో చూస్తానని హెచ్చరించారు. పంటల్ని కొనేందుకు నిరాకరిస్తే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి ఇండ్ల ముందు ఆ ధాన్యాన్ని పోస్తామని హెచ్చరించారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామన్నారు. ఇప్పుడు బస్సులేసుకుని యాత్ర చేసే బీజేపీ నాయకుల ఇండ్లకు కూడా వెళ్తామన్నారు. ధరలు నిర్ణయించే కేంద్రానికి ధాన్యం కొనే బాధ్యత లేదా?అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 62 లక్ష‍ల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశామననీ, చివరి గింజ వరకు కొంటామన్నారు. రైతులు కష్టంలో ఉంటే వారి వద్దకెళ్లి సెల్ఫీలు దిగి సెల్ఫ్‌ ‌డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు.

తుమ్మిడిహట్టిపై చర్చిస్తాం
తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని సీఎం తెలిపారు. దీనికోసం ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో చర్చలకు అపాయింట్‌‌మెంట్‌ అడిగామనీ, ఇంకా రాలేదన్నారు. సోమవారం ఆదిలాబాద్‌‌కు వెళ్తున్నానని చెప్పారు.

కేటీఆర్‌ ‌పేరు మార్చుకో..
అంబేద్కర్‌, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ ‌రాజకీయాలకు అతీతమని రేవంత్‌‌రెడ్డి చెప్పారు. వారిని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించి చూడలేమన్నారు. వారు జాతిరత్నాలని అన్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్‌ ‌విగ్రహాన్ని పువ్వాడ అజయ్‌ ‌పెడితే బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అమీర్‌‌పేట్‌‌లో ఎన్టీఆర్‌ ‌విగ్రహం పెడితే ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. నంద్యాల నుంచి ఎంపీగా పనిచేసిన పీవీ నరసింహారావు విగ్రహం అక్కడ పెట్టాలని కేసీఆర్‌ ఏనాడైనా అడిగారా?అని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వస్తే పీవీ విగ్రహం పెట్టిస్తామన్నారు. ఎన్టీఆర్‌‌కు వ్యతిరేకంగా మాట్లాడే బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ముందు కల్వకుంట్ల తారక రామారావు పేరును మార్చుకోవాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తొందరేముంది
రాష్ట్రంలో జనగణన, సర్‌ ‌ప్రక్రియ జరుగుతోందని రేవంత్‌‌రెడ్డి చెప్పారు. అందుకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తొందరేముందని అభిప్రాయపడ్డారు. జూన్‌ ‌2న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తామనీ, అయితే నామినీల కోసం ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు.

అంబానీ, అదానీలకు పోటీ మా మహిళలే
అంబానీ, అదానీలకు పోటీ మహిళలేనని రేవంత్‌‌రెడ్డి అన్నారు. వారి కోసం అద్భుతమైన ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. మహిళా సమాఖ్యలకు గోదాములు, రైస్‌ ‌మిల్లులు నిర్మించి ఇస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌ ‌నుంచి హరీశ్‌‌రావు పోటీ చేయరు
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ‌నుంచి హరీశ్‌‌రావు పోటీ చేయబోరని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. ఆయన ఫ్యూచర్‌ ఏంటో ఆయనకే తెలీదన్నారు. ఫ్యూచర్‌ ‌సిటీని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఆయన ఎవరిని కలుస్తున్నారో పూర్తి సమాచారం తన వద్ద ఉందన్నారు. ఆ వివరాలు బయటపెడితే బాగుండదని చెప్పారు. 2008లో వైఎస్‌‌ను కలిశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ ‌కుటుంబంలో ఎవరు అరెస్టు అయ్యేది కేంద్రం చేతుల్లో ఉందన్నారు.

నాది, మహేష్‌‌గౌడ్‌ది సక్సెస్‌‌ఫుల్‌ ‌కాంబినేషన్‌
తనది, పీసీసీ అధ్యక్ష‍ుడు మహేష్‌ ‌గౌడ్‌‌ది సక్సెస్‌‌ఫుల్‌ ‌కాంబినేషన్‌ అని రేవంత్‌‌రెడ్డి అన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ‌గెలిచిందని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తమ ఇద్దరి కాంబినేషన్‌‌లోనే వెళ్తామనీ, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2034 వరకు తానే సీఎంగా ఉంటానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -