ప్రకటించిన కేపీసీసీ
జూన్ 3న ప్రమాణస్వీకారం
బెంగళూరు : కర్నా టక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం సిద్ధరామయ్య డీకే పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఏఐసీసీ పరిశీలకులు ప్రకటించారు. కాగా కేవలం పది నిమిషాల్లోనే సీఎల్పీ భేటీ ముగియడం గమనార్హం.
జూన్ 3న ప్రమాణ స్వీకారం
కర్నా టక కొత్త సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 3న జరగనుంది. ఈ విషయాన్ని కర్నా టక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జీసీ చంద్రశేఖర్ ప్రకటిం చారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం లోక్‌భవన్‌లో జరుగనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే సీఎం ప్రమాణస్వీకారోత్సవ వేదికను లోక్‌భవన్‌కు మార్చినట్టు చంద్రశేఖర్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎవరు కూడా లోక్‌భవన్‌కు రావద్దన్నారు. పార్టీ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు.
గవర్నర్ తో డీకే భేటీ
లోక్‌భవన్‌లో శనివారం ఉదయం గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్‌తో డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. గవర్నర్ ఆదివారం ధర్మస్థలలో జరిగే ఉపరాష్ట్రపతి పర్యటనకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన బెంగళూరు వెళ్తున్నారు. గవర్నర్ అందుబాటులో ఉండరనే ఉద్దేశంతోనే, సీఎల్పీ సమావేశానికి ముందే డీకే ఆయనతో భేటీ అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మంత్రివర్గంలో సిద్ధరామయ్య తనయుడికి చోటు దక్కే అవకాశాలు
శివకుమార్ సీఎం అయ్యాక, కొత్త మంత్రి వర్గంలో సిద్ధరామయ్య కుమారుడికి చోటు దక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య, కొత్త క్యాబినెట్‌లో తన తరఫున మంత్రుల జాబితాను పార్టీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పరిశీలన కోసం అందించారు. అందులోనూ తన కుమారుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్రకు ఉపముఖ్యమంత్రి పదవితోపాటు, కీలక శాఖలు కేటాయించాలని ప్రత్యేకంగా కోరినట్టు తెలుస్తోంది. ఇక్కడ మరోకీలక అంశం ఏమిటంటే.. సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మంత్రుల్లో దాదాపు సగం మందికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని సమాచారం. మరోపక్క కర్నా టక కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం విమర్శల వర్షం కురిపించారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. అసలు రాష్ట్రంలో అర్థవంతమైన మార్పు వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు.
మంత్రిమండలి రద్దు
సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ ఆమోదించడంతో పాటు మంత్రిమండలిని కూడా రద్దు చేశారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు సిద్ధరామయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా డీకే శివకుమార్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో కర్నాటక సీఎం అంశం పరిష్కారమైంది. ఇక రాజ్యసభ నామినేషన్లు, ఎమ్మెల్సీ పదవులతో సహా కీలక నియామకాలను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.


