నవతెలంగాణ – మక్తల్ : నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని కల్వాల గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు తమ అసాధారణ సంగీత ప్రతిభతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి మండలానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు తీసుకువచ్చారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సంగీత సంస్థ హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కీబోర్డ్ సంగీత ప్రదర్శనలో పాల్గొన్న ఇస్రంపల్లి షారోన్ (10వ తరగతి), ఇస్రంపల్లి చార్లేస్ ఫిన్నీ (9వ తరగతి) అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నీస్ రికార్డు సాధించారు.
గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ భారీ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు గంటపాటు నిరంతరాయంగా కీబోర్డ్ వాయిస్తూ రికార్డు నెలకొల్పారు. ఇందులో షారోన్, చార్లేస్ ఫిన్నీ మూడు సరళీ స్వరాలను కేవలం 45 సెకన్లలోనే వాయించి నిర్వాహకులను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి సుమారు 2,000 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 777 మంది మాత్రమే గిన్నీస్ రికార్డుకు ఎంపికయ్యారు.
వారిలో నర్వ మండలం కల్వాల గ్రామానికి చెందిన ఇస్రంపల్లి జక్కయ్య, సృజన దంపతుల సంతానమైన షారోన్, చార్లేస్ ఫిన్నీ చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో గల ఎంఎన్ఆర్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని మే 29న హైదరాబాద్ గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించిన ‘గిన్నీస్ అచీవర్స్ మీట్’ కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి స్వయంగా పాల్గొని విజేతలకు గిన్నీస్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.



