Monday, June 1, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగెలుపు సంబురాలు హింసాత్మకం

గెలుపు సంబురాలు హింసాత్మకం

- Advertisement -

ఫ్రాన్స్‌‌ ఫుట్‌‌బాల్‌ ‌వేడుకల్లో అల్లర్లు
పెద్ద ఎత్తున తరలి వచ్చిన పీఎస్‌‌జీ ఫ్యాన్స్‌
అభిమానులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ
780 మంది అరెస్ట్‌.. 219 మందికి గాయాలు

ప్యారిస్‌ : యూరోపియన్‌ ‌ఫుట్‌‌బాల్‌‌లో అత్యంత ప్రతిష్టాత్మకమై ఛాంపియన్స్‌ ‌లీగ్‌ ‌ఫైనల్లో పారిస్‌ ‌సెయింట్‌-‌జర్మేన్‌ (‌పీఎస్‌‌జీ) విజయం సాధించిన అనంతరం ఫ్రాన్స్‌ ‌వ్యాప్తంగా జరిగిన సంబరాలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. అభిమానులు, అల్లరిమూకలు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో మొత్తం 219 మంది గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఫ్రెంచ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్‌ ‌న్యూనెజ్‌ ‌వెల్లడించారు. అల్లర్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 780 మందిని పోలీసులు అరెస్ట్‌ ‌చేయగా..వారిలో 450 మందికి పైగా పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ ఘటనల్లో 57 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ప్యారిస్ రింగ్ రోడ్డుపై అల్లరిమూకలు మార్గాన్ని దిగ్బంధించేందుకు ప్రయత్నించిన సమయంలో జరిగిన ప్రమాదంలో 24 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. పీఎస్‌జీ విజయం అనంతరం ప్యారిస్‌లోని ప్రసిద్ధ షాంప్స్-ఎలిసీస్ ప్రాంతం అభిమానులతో కిక్కిరిసిపోయింది. కొందరు వ్యక్తులు రోడ్లపై ఫ్లేర్లు వెలిగించడం, ఎలక్ట్రిక్ బైక్‌లకు నిప్పంటించడం, దుకాణాల అద్దాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.ప్యారిస్ నగరంలోనే 480 అరెస్టులు నమోదయ్యాయి. అందులో 277 మందిని కస్టడీలోకి తీసుకోగా, వీరిలో 82 మంది మైనర్లు ఉన్నారు. పోలీసులపై దాడులు, ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల ధ్వంసం, దొంగతనాలు, అక్రమ ఆయుధాల కలిగివుండటం వంటి కేసులు నమోదైనట్టు ప్యారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ఇదే సమయంలో మరో ప్రాంతంలో జరిగిన గొడవలో ఒక యువకుడు అత్యంత విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే ఆయన ఫుట్‌బాల్ అల్లర్లతో సంబంధం కలిగి ఉన్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంకాలేదు. అల్లర్ల కారణంగా ప్యారిస్‌లో బస్సు, రైలు, మెట్రో సేవలు కొంతమేరకు అంతరాయం ఎదుర్కొన్నాయి. ఆదివారం నిర్వహించిన పీఎస్‌జీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఆరువేల మంది పోలీసులను మోహరించారు. ఐఫిల్ టవర్ సమీపంలోని షాంప్-డి-మార్స్ ప్రాంతంలో వేలాది మంది అభిమానులు జట్టుకు ఘన స్వాగతం పలికారు. అల్లర్లపై స్పందించిన మంత్రి లారెంట్ న్యూనెజ్… “చాలామంది అభిమానులు ప్రశాంతంగా సంబరాలు జరుపుకుంటారు. అయితే మ్యాచ్‌తో సంబంధం లేని కొందరు వ్యక్తులు కావాలనే అల్లర్లు సృష్టించడానికి వస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. మరోవైపు ఫ్రాన్స్‌లోని మితవాద నాయకురాలు మరైన్‌‌ ల పెన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ… “ఒక ఫుట్‌బాల్ క్లబ్ విజయం అల్లర్లకు దారితీయడం ఫ్రాన్స్‌లోనే సాధ్యం. విజయోత్సవ రాత్రి హింస భయంతో ప్రజలు ఇండ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని విమర్శించారు. కాగా ఫ్రాన్స్‌లో గతేడాది కూడా పీఎస్‌జీ విజయ సంబరాల సందర్భంగా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. ఈసారి కూడా విజయోత్సవాలు భద్రతా సవాలుగా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -