కార్మిక కుటుంబాలకు రక్షణ కవచం రూ. కోటి ప్రమాద బీమా
సహజ మరణానికి రూ.10 నుంచి రూ.15 లక్షలు
ఇప్పటి వరకు 45 కుటుంబాలకు రూ.41 కోట్ల సొమ్ము చెల్లింపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెట్ (ఎస్‌సీసీఎల్) కార్మికుల సంక్షేమం కోసం ప్రమాద బీమా పథకాలను అమలు చేస్తోంది. కార్మికులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 1.25 కోట్ల వరకు బీమా అందుతోంది. అలాగే సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.10 నుంచి రూ.15 లక్షల ఉచిత బీమాను కూడా కల్పిస్తున్నారు. ఈ సదుపాయం కోసం కార్మికులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు సైతం రూ. 30 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని సంస్థ అమలు చేస్తోంది. ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా కుంగిపోయి ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో చిక్కుకున్న జీవితాలకు సంస్థ అందిస్తున్న బీమా భరోసాగా నిలుస్తోంది. 2024లో ప్రారంభమైన ఈ పథకం నేడు దేశవ్యాప్తంగా బీమా రంగంలో ఒక విప్లవాత్మక చేయూతగా మారింది.
పలు బ్యాంకులతో ఒప్పందం
కార్మికుల ప్రమాద బీమా అమలుకు సింగరేణి సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. కార్పొరేట్ శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న కార్మికులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రమాద బీమా పథకం కింద 1.25 కోట్ల రూపాయలను చెల్లించడానికి సింగరేణితో ఒప్పందం చేసుకొని అమలు చేస్తున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 40,275 మంది ఉద్యోగులకు ఈ బీమా వర్తిస్తోంది. సింగరేణి ఉద్యోగులు వ్యక్తిగతంగా పలు ప్రమాద బీమా పథకాలలో సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ పథకాల కింద నిబంధనల ప్రకారం ఎంతో కొంత సొమ్మును ఇన్సూరెన్స్ కింద చెల్లిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సింగరేణిలో పలు బ్యాంకులు అమలు జరుపుతున్న ప్రమాద బీమా పథకానికి ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒప్పందం జరిగింది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా..
సింగరేణి ఉద్యోగులు ఎవరైనా అనుకోని ప్రమాదాల లో మృతి చెంది నప్పుడు వారి కుటుం బాలు తీవ్రమైన మానసిక వేదనతో పాటు, ఆర్థిక ఇబ్బందు లను కూడా ఎదుర్కో వాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ప్రమాద బీమా పథకం వారికి అండగా ఉంటోంది. ఉచిత ప్రమాద బీమా పథకం కింద రెండేండ్ల కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 32 మందికి రూ.28 కోట్లు చెల్లించడం జరిగింది. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా 13 మందికి రూ.13 కోట్లను చెల్లించడం జరిగింది. సాధారణం గా ఇటువంటి బీమా పథకంలో చేరాలంటే ప్రీమియం అమౌంట్ గా ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్న ప్రదేశాలు, వయస్సును బట్టి పెద్ద మొత్తంలో ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా ఎటువంటి ప్రీమియం చెల్లింపు లేకుండానే ఉచితంగా ఈ 10 లక్షల రూపాయల సహజ మరణ బీమా పథకాన్ని కూడా బ్యాంకులు అమలు జరుపుతున్నాయి. పొరుగు సేవల సిబ్బందికీ రూ.40 లక్షల ప్రమాద బీమా అంద జేస్తున్నారు. సింగరేణిలో దాదాపు 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తు న్నారు. అలాగే విశ్రాంత సింగరేణి ఉద్యోగు లకూ కూడా ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నారు.
రెండు కుటుంబాలకు చెక్కుల అందజేత
ప్రమాదంలో మృతి చెందిన సింగరేణికి చెందిన రెండు కుటుంబాలకు ఉచిత ప్రమాద బీమా పథకం కింద రూ.1.25 కోట్ల చెక్కులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అదివారం అందజేశారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరిన 18 నెలలకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంతోష్, అలాగే ప్రమాద వశాత్తు మృతి చెందిన రంజిత్ కుమార్ కుటుంబాలు లబ్ది పొందాయి. సంపాదించే ఇంటి పెద్దలు మరణించడంతో దిక్కులేని స్థితిలో ఉన్న తమకు సంస్థ ప్రారంభించిన ఉచిత బీమా ఎంతగానో ఉపయోగ పడిందని వారు పేర్కొన్నారు.



