Monday, June 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభిస్తాం

బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభిస్తాం

- Advertisement -

ఉచిత బస్సు ప్రయాణంతో గ్రామీణ ప్రాంతాల్లో బస్సులకు డిమాండ్
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : 
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెద్దపల్లి బస్‌డిపో స్థల పరిశీలన


నవతెలంగాణ – పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్‌డిపో స్థలాన్ని ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావుతో కలిసి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు, సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్ డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీఁ మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కార్మికులు అనవసర ఆందోళన చెందొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -