Saturday, February 7, 2026
E-PAPER
Homeజాతీయంస్తంభించిన పార్లమెంట్‌

స్తంభించిన పార్లమెంట్‌

- Advertisement -

ఐదోరోజూ అదే తీరు
లోక్‌సభలో స్పీకర్‌ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
ఉభయ సభల్లో అంతరాయం.. సోమవారానికి వాయిదా

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్‌ శుక్రవారం స్తంభించింది. ఉభయ సభల్లో వరుసగా ఐదో రోజు అంతరాయం కలిగింది. లోక్‌సభ, రాజ్యసభ ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరపకుండానే సోమవారం వరకు వాయిదా పడ్డాయి. అమెరికా ప్రయోజనాలకు పూర్తిగా లొంగిపోవడం, వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయడం, భారత్‌-చైనా ఉద్రిక్తత సమయంలో కీలకమైన నిర్ణయాలను ఆలస్యం చేయడం వంటి ఆరోపణలను మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రధానంగా చేశాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలిపాయి. మాజీ ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే రాసిన వివాదాస్పద పుస్తకం ‘ఫర్‌ ది స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ చిత్రాలతో కూడిన బ్యానర్‌లను పట్టుకుని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ‘నియంతృత్వాన్ని అనుమతించరు’, ‘ప్రతిపక్షాలను మాట్లాడటానికి అనుమతించాలి’, ‘నరేంద్ర లొంగిపోయారు’ వంటి నినాదాలు సభలో హోరెత్తాయి.

దీని తరువాత, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాల నిరసనలు తగ్గలేదు. పోస్టర్లు, ప్లకార్డులు, బ్యానర్ల నినాదాలు కొనసాగాయి. ప్రధాని లోక్‌సభను ఎదుర్కోవడానికి భయపడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ సమావేశంలో 19 గంటల 13 నిమిషాలు నిరంతర నిరసనలతో సమయం వృథా అయ్యిందని స్పీకర్‌ ఆరోపించారు. అయితే, ప్రతిపక్షాల డిమాండ్లను ఆమోదించే వరకు బడ్జెట్‌ చర్చలకు తాము ఏ విధంగానూ సహకరించబోమని, తమ వైఖరిలో మార్పు లేదని ప్రతిపక్షం స్పష్టం చేసింది. అనంతరం సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. రాజ్యసభలో కూడా ఇలాంటి నిరసనలే జరిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసనలు పార్లమెంటు వెలుపలా కొనసాగాయి. ‘ఎటువంటి ఒప్పందం అనుమతించబడదు’ అనే బ్యానర్‌తో ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌ గేటు వద్ద నిరసన తెలియజేశారు. సస్పెండైన ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.

స్పీకర్‌ తీరుపై విమర్శలు
ప్రధానిపై ప్రతిపక్ష సభ్యులు దాడి చేయాలని ప్లాన్‌ చేశారనే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆరోపణలపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఓం బిర్లా జోక్యం చేసుకున్నా… అది స్పీకర్‌ పదవి నుంచి ఆశించిన తటస్థ, మధ్యవర్తిత్వ వైఖరికి విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. లోక్‌సభలో ధన్యవాద తీర్మానం చర్చకు సమాధానం ఇవ్వడానికి రాని ప్రధానిని రక్షించడానికి ‘ప్రధానమంత్రి తన అభ్యర్థన మేరకు సభకు రాలేదని’ నిరూపించడానికి ఓం బిర్లా ప్రయత్నాలు చేశారు. దీనికోసం ప్రతిపక్ష మహిళా సభ్యులు మోడీపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారం ఆధారంగా లోక్‌సభకు రావద్దని ప్రధానమంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు. స్పీకర్‌గా, సభను సజావుగా నడిపించే బాధ్యత ఓం బిర్లాకు ఉంది. దానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారాలు ఆయనకు ఉన్నాయి. అయితే, ప్రధానమంత్రిని రక్షించడానికి ఓం బిర్లా అడుగుపెట్టి స్పీకర్‌ పదవి నిష్పాక్షికత, విశ్వసనీయతను గాలికి వదిలేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -