ఏప్రిల్‌లో వచ్చిన ఆదాయం రూ.10,974.73 కోట్లు
చేసిన ఖర్చు రూ.19,501.32 కోట్లు
ఆదాయ, వ్యయాల మధ్య భారీ అంతరం
కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.16.89 కోట్లు
ఒక్క నెలలోనే రూ.11,413.93 కోట్ల అప్పు : కాగ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆశించిన ఆదాయం రాకపోవడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,41,263.59 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అంటే నెలకు రూ.20,105.25 కోట్లు రావాలి. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల ఏప్రిల్‌లో రూ.10,974.73 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అనుకున్న లక్ష్యం కంటే రూ.9,130.52 కోట్ల ఆదాయం తక్కువగా రావడం గమనార్హం. ఇంకోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,34,405.83 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే నెలకు రూ.19,533.82 కోట్లు ఖర్చు చేయాలి. ఏప్రిల్‌లో రూ.19,501.32 కోట్లు ఖర్చు చేసింది. అనుకున్న దాని ప్రకారమే ఖర్చు చేసినా రాబడి మాత్రం అనుకున్నట్టుగా రాలేదు. దీంతో ప్రభుత్వానికి రాబడి తక్కువ.. వ్యయం ఎక్కువ అన్నట్టుగా మారింది. రాబడి కంటే రూ.8,526.59 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేసింది. రాబడి, వ్యయాల మధ్య అంతరం భారీగా ఉండడం గమనార్హం.ఈ గణాంకాలను కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియ (కాగ్) విడుదల చేసింది.
కేంద్రం చిన్నచూపు
గ్రాంట్ల విడుదలలో తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్లు రూ.24,166 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంటే నెలకు రూ.2,013.83 కోట్లు రావాలి. కానీ ఏప్రిల్‌లో రూ.16.89 (0.07 శాతం) కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. తెలంగాణ పట్ల కేంద్రం ఎంత వివక్షను ప్రదర్శిస్తున్నదో అర్థమవుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్లు రూ.22,782.50 కోట్లు వస్తాయని అంచనా వేసింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.10,422.98 (45.75 శాతం) కోట్లు మాత్రమే విడుదల చేసింది. గుజరాత్‌కు మాత్రం వంద శాతం గ్రాంట్లను విడుదల చేయడం గమనార్హం.
బీఆర్‌ఎస్ దారిలోనే కాంగ్రెస్
రాష్ట్రంలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ దారిలోనే నడుస్తున్నది. బీఆర్‌ఎస్ అధికారంలోకి ఉన్నపుడు విచ్చలవిడిగా అప్పులు చేసిందంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుండడం విమర్శలకు దారితీస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.58,458.71 కోట్ల అప్పు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే నెలకు రూ.4,871.56 కోట్లు అప్పు తేవాలి. ఏప్రిల్ ఒక్కనెలలోనే రూ.11,413.93 (19.05 శాతం) కోట్లు అప్పు తెచ్చింది. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా ఆదాయం రాకపోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.54,009.74 కోట్ల అప్పు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.77,762.35 (143.98 శాతం) కోట్లు అప్పు చేసింది. అంటే అనుకున్న లక్ష్యం కంటే రూ.23,752.61 కోట్లు అదనంగా తెచ్చింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ అనుకున్న దాని కంటే ఎక్కువ అప్పు తెస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నా, కొత్త పథకాలను ప్రవేశపెట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.



