ఆ వార్డుల్లో అభివృద్ధికి నాదే బాధ్యత : ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ(ఎం) పోటీ చేస్తున్న 15, 16, 29, 30 వార్డుల అభివృద్ధి బాధ్యత నాదేనని, ప్రజలందరూ సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లాలో డీసీసీ మాజీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్‌రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.నాగయ్య, జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం ఆయా వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. గ్రూప్ సమావేశాలు, రోడ్ షోలలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏ రాజకీయంగా అవసరం వచ్చినా సీపీఐ(ఎం) అండగా ఉంటోందని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుకు అందరూ కృషి చేయాలని, కాలనీలు అభివృద్ధికి అవసరమైన రోడ్లు, మురుగు కాల్వలు, ఇందిరమ్మ గృహాలు, విద్యుత్ వీధిలైట్ల సౌకర్యాలు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) కౌన్సిలర్లు గతంలో గెలిచినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అందుకే ఈసారి కూడా వారిని నమ్మి కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తోందన్నారు. 30వ వార్డులో కమ్యూనిటీ హాల్ మంజూరుకు నిధులు ఇస్తానని, స్థలం సేకరించుకోవాలని సూచించారు. 15వ వార్డులో ఆర్టీసీ కాలనీలో రోడ్లు కిందకు ఉన్నాయని వినతిపత్రం సమర్పించగా.. రోడ్డును ఎత్తు చేసే బాధ్యత నాదే అని, పేదలకు ఇందిరమ్మ గృహాలు ఇప్పిస్తానని చెప్పారు. కాలనీలో పేదలు జీవో నెంబర్ 59 ద్వారా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి రూ.10లక్షల నుంచి రూ.15లక్షలు చెల్లించాలని ప్రభుత్వ నోటీసులు జారీ చేసిందని అన్నారు. సకాలంలో ఆ సమస్య పరిష్కరించి ఉచితంగా ఇంటి పట్టాలు ఇస్తామన్నారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్ ఏకమై పోరాడి మున్సిపాలిటీని కైవసం చేసుకుని మానుకోట అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. మీ కాలనీలో అభివృద్ధి కావాలంటే మీ చేతుల్లోనే ఉందని, సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. 15, 16, 29, 30 వార్డుల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు బానోతు బాబు, భానోత్ సీతారాం నాయక్, సుర్ణపు సోమయ్య, చాగంటి భాగ్యమ్మను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గునిగంటి రాజన్న, ఆకుల రాజు, రావుల రాజు, చీపిరి యాకయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



