సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థతకు, నిర్లక్ష్యానికి ఎలాంటి హద్దులు లేవని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోమవారం ఆయన ఒక పోస్టు చేశారు. సిబిఎస్ఇ 12వ తరగతి విద్యార్థులకు చెందిన లక్షలాది జవాబు పత్రాలు బహిరంగంగా అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి ధృవీకరణ లేకుండా వీటిని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని బేబీ తెలిపారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న జవాబు పత్రాలను పరిశీలిస్తే, వీటి సరైన స్కానింగ్ యంత్రాల నుంచి కాకుండా, నాసిరకంగా స్కాన్ చేసిన కాపీలని స్పష్టమవుతోందని బేబీ చెప్పారు. బ్లాక్‌లిస్ట్ లో ఉన్న ఒక అవినీతి కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లలో అవకతవకలు చేసి, నిబంధనలను సడలించారని ఇప్పుడు వెల్లడయిందని, ఇది లక్షలాది విద్యార్థులను ఒత్తిడి, అనిశ్చితిలోకి నెట్టి, వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి వేసిందని బేబీ విమర్శించారు. వీటికి తోడుగా టెండర్లను కేటాయించే ముందు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేసే హక్కును సిబిఎస్ఇ తనకే తానే పొగొట్టు కుందని బేబీ తెలిపారు. ఇదంతా ఒక కుంభకోణమని, వీటిన్నంటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యుడనే నిజాన్ని విద్యార్థులు, యువత బయటపెట్టారని బేబీ చెప్పారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని బేబీ ఈ పోస్టులో డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ కు పదవిలో కొనసాగే హక్కు లేదు
- Advertisement -
- Advertisement -



