తాను యూదులకు వ్యతిరేకం కాదని, యూదు దురహంకారానికి, పాలస్తీనా లో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణకాండను నిరసి స్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మందానీ మరోసారి విస్పష్టంగా ప్రకటించారు. భారతీయులైన మహమ్మద్ మందానీ, మీరా నాయర్‌ల సంతానమైన 35 ఏండ్ల జోహ్రాన్ న్యూయార్క్ నగరానికి 112వ, తొలి ముస్లిం సామాజిక తరగతికి చెందిన మేయర్. వామపక్ష భావజాలం కలిగి ఉన్నందుకు కమ్యూనిస్టు అని ముద్ర వేసినప్పటికీ నగరపౌరులు పట్టించుకోకుండా ఎన్నుకున్నారు. తాజాగా మరోసారి అమెరికా మీడియాలో వార్తలకు ఎక్కారు. ఆదివారం నాడు నగరంలో జరిగిన వార్షిక ఇజ్రాయిల్ దినోత్సవాన్ని బహిష్కరించారు. ఇజ్రాయిల్ అనుకూల ఏ కార్యక్రమమంలో కూడా భాగస్వామిని అయ్యేది లేదని ఎన్నికల సమయంలోనే కరాఖండిగా చెప్పానని కూడా గుర్తు చేశారు. తాను యూదుల జీవన శైలికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశాడు. వారం రోజుల ముందే విలేకర్లతో మాట్లాడిన మందానీ తాను పాల్గొనకపోయినా ఆ రోజు జరిగే కార్యక్రమానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లుగానే అసాధారణ రీతిలో పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు జరగకుండా చూశారు. ఇజ్రాయిల్ ఉనికిలోకి వచ్చిన తరువాత 1964 నుంచి ప్రతి ఏటా జరుగుతున్న ఈ కార్యక్రమంలో నగర మేయర్ విధిగా పాల్గొనాలని గతంలో నిర్ణయించారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ మేయర్లందరూ పాల్గొన్నారు, దాన్ని తిరస్కరించిన తొలి వ్యక్తిగా జోహ్రాన్ మందానీ చరిత్రకెక్కారు. ఈ ఉదంతం గురించి ప్రపంచ మీడియాలో పెద్దఎత్తున వార్తలు, విశ్లేషణలు వెలువడ్డాయి. డెమోక్రటిక్ పార్టీలో సోషలిస్టు వర్గంగా ఉన్నవారిలో మందానీ ఒకడు. అతను కార్యక్రమాన్ని బహిష్కరించినప్పటికీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది భాగస్వాము లయ్యారు. మందానీతో ఏకీభవించిన వారు కూడా దూరంగా ఉన్నారు. యూదు సామాజిక తరగతికి చెందిన వారంతా దురహంకారులు కాదన్నది మేయర్ ఎన్నికల సమయంలోనే రుజువైంది. న్యూయార్క్ నగరంలో యూదు సామాజిక తరగతికి చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో గాజాలో ఇజ్రాయెల్ ప్రభుత్వం జరిపిన మారణకాండను తీవ్రంగా వ్యతిరేకించటం, ఆ ప్రభుత్వాన్ని విమర్శించటంలో జోహ్రాన్ మందాని ఎంతో స్పష్టంగా ఉన్నారు. మారణకాండకు బాధ్యుడైన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వస్తే అంతర్జాతీయ న్యాయస్థాన వారంట్ ప్రకారం అరెస్టు చేయిస్తానని కూడా చెప్పిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి.
ఆదివారం నాటి ఇజ్రాయిల్ దినోత్సవంలో ఆ దేశానికి చెందిన ముగ్గురు దురహంకారులైన మంత్రులు ప్రతినిధులుగా పాల్గొన్నందున అది ఆ దేశ కార్యక్రమంగానే చూశారు. అలాంటి వారితో తాము గళం కలపటం ఏమిటని మందానీతో సహా అనేక మంది డెమోక్రాట్లు ప్రశ్నించారు. అంతే కాదు న్యూయార్క్ మాజీ కంప్‌ట్రోలర్, నవంబరులో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సిద్ధ మౌతున్న బ్రాడ్ లాండర్, జాతి, ఆర్థిక న్యాయాల కోసం పోరాడుతున్న యూదుల సంస్థకు చెందిన వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇజ్రాయిల్ దినోత్సవం రోజున ప్రదర్శనల్లో పాల్గొన్న ఇజ్రాయిలీ రాజకీయనేతలు పాలస్తీనియన్ల ఊచకోతకు హర్షాతిరేకాలు వెల్లడించటమే కాదు, మారణకాండకు పాల్పడిన ప్రభుత్వంలో భాగస్వాములు. ఇజ్రాయిల్ ఉత్సవాలు యూదుల ఉనికి లేదా వారికి గర్వకారణం కాదంటూ, ఇది న్యూయార్క్ నగరమేయర్‌కు తెలుసని ఉత్సవంలో భాగస్వాములు గాకపోవటం తమకు ఎంతో ఆనందంగా ఉందని యూదుల సంస్థ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అయితే ప్రదర్శనలో పాల్గొనకూడదన్నది మేయర్ నిర్ణయమని, తాను గర్వంతో హాజరవుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్, యూదు సామాజిక తరగతికి చెందిన జెస్సికా టిచ్ ప్రకటించారు. ప్రతి ఏడాది ఈ రోజు ఎంతో ఆనందకరమైనదని అమె వర్ణించారు. మొదటి నుంచీ మందానీని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయిల్ అనుకూలురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి కుదరక రాకపోవటం కాదని, భావజాలపరమైన, అవమానకర నిర్ణయమని వ్యాఖ్యానించారు. మీడియా రారాజుగా పేరున్న రూపర్ట్ మర్డోచ్ నిర్వహణలోని న్యూయార్క్ పోస్ట్ పత్రిక మొదటి పేజీలో మోటార్ సైకిల్ మీద తిరుగుతున్న మందానీ ఫొటో వేసి విద్వేష సైకిల్ , జో ఇజ్రాయిల్ పరేడ్‌ను అవమానిస్తూ సైకిల్ మీద తిరుగుతున్నాడు అంటూ వ్యాఖ్యానించింది.
మేయర్‌కు మద్దతు ఇచ్చినవారి వాదనేమిటో చూద్దాం. న్యూయార్క్ ప్రదర్శనకు వచ్చిన వారిలో ఒకడైన బెజాలెల్ మోట్రిచ్ ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి, పాలస్తీనియన్ల మారణకాండను బహిరంగంగా సమర్ధించిన ఒక యూదు జాతీయ ఉన్మాది అని పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికా వచ్చి వెళ్లిన రెండువారాల తరువాత తనను ఆరెస్టు చేసేందుకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రయత్నిస్తున్నదని ఆరోపించాడు.అతను యూదు మత పార్టీనేత, అధికారిక అతిధుల జాబితాలో తొలుత అతని పేరు లేదు, చివరికి హాజరయ్యాడు. ఇలాంటి వాడితో కలసి ప్రదర్శనలో పాల్గొనటం అనేక మంది డెమోక్రాట్లకు ఇబ్బంది కరంగా తోచింది. అతను 2023లో మాట్లాడుతూ పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని హవారా అనే పాలస్తీనియన్ల గ్రామాన్ని ప్రభుత్వమే నాశనం చేయాలని పిలుపునిచ్చాడు. ఆ వెంటనే ఉన్మాదులైన యూదులు పాలస్తీనియన్లను ఊచకోత కోశారు.అతని రెచ్చగొట్టే వ్యాఖ్యలను చివరికి అమెరికా కూడా ఖండించింది. గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమికొట్టాలని, వెస్ట్ బ్యాంకు ప్రాంతాన్ని యూదులతో నింపాలని మోట్రిచ్ పిలుపునిచ్చాడు. మరొకరు ఇజ్రాయిల్ వలస వ్యవహారాల మంత్రి ఆఫిర్ సోఫెర్. ఇతను మరింతగా రెచ్చిపోయాడు. ఇజ్రాయిల్‌కు వలస వస్తున్న యూదులందరూ సనాతనుల ప్రమాణాలను పాటించేవారు కాదని, లౌకిక, సంస్కరణ వాదులైన వారు, పాక్షిక వారసత్వం ఉన్న యూదులకు ఇక్కడ చోటు ఇవ్వరాదన్నాడు. మరొక మంత్రి అండ్ ఎలియాహు, గాజా మీద అణుబాంబు వేయాలని, వెస్ట్ బ్యాంక్‌ను విలీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. ఇలాంటి వారి సరసన మందానీ పాల్గొంటాడా!
తాను ఇజ్రాయిల్ ఉనికి ప్రశ్నించటం లేదని, యూదులకు ఉన్నట్లే ఇతరులకూ హక్కులు ఉంటాయని గుర్తించాలని మందానీ చెప్పాడు. న్యూయార్క్ నగరంలో యూదు వ్యతిరేక ధోరణులు పెరగకుండా చూసేందుకు ఉన్న సంస్థకు నిధుల పెంపుదలకు కూడా చర్యలు తీసుకున్నాడు. జోహ్రాన్ మందానీ సిద్ధాంతాల వలన వివాదం తలెత్తింది తప్ప మోట్రిచ్ వంటి ఫాసిస్టు శక్తులతో కలసి డెమోక్రాట్లు భాగస్వాములైనం దుకు కాదని బరాక్ ఒబామా ఏలుబడిలో భద్రతా సలహాదారుగా పని చేసిన బెన్ రోడ్స్ వ్యాఖ్యానించాడు.మోట్రిచ్ పచ్చిమితవాద వాచాలత్వం విలువలకు కట్టుబడిన న్యూయార్క్ వాసులంగా ఉన్న తమకు వ్యతిరేకమైనదని, అతని భాగస్వామ్యం యూదు సామాజికులకు గర్వకారణం కానందున తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ముస్లిం వ్యతిరేకతకు నగరంలో స్థానం లేదని మరికొందరు స్పందించారు. ఏడు లక్షల మంది పాలస్తీనియన్లను వెళ్లగొట్టి 1948లో ఇజ్రాయిల్‌ను ఉనికిలోకి తెచ్చారంటూ ఈ ప్రదర్శనకు కొద్ది రోజుల ముందు ఒక వీడియోను విడుదల చేశారు. తాను తొమ్మిదేండ్ల బాలికగా ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, అప్పటి నుంచి వివిధ ప్రాంతాలలో ప్రవాసంలోనే గడుపుతున్నానని ప్రతిచోటా వెలుపలి మనిషిగానే చూశారని ఇనియా బుష్‌నాక్ ఆ వీడియోలో చెప్పిన మాటలు ఉన్నాయి.
తాజా వివాదం న్యూయార్క్ నగరం, అమెరికాలో మారుతున్న యూదుల ఆలోచనా సరళిని ప్రతిబింబించింది. న్యూయార్క్ నగరంలో సామాజిక పరంగా చూస్తే ఎక్కువ మంది యూదులు ఉన్నారు. మేయర్లుగా గతంలో పని చేసినవారందరూ ఇజ్రాయిల్‌ను సమర్ధించినవారు, తరచూ ఆ దేశాన్ని సందర్శించినవారే. జోహ్రాన్ మందానీ ఆ బాటలో నడవని ఒకే ఒక్కడు అంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్ నెలలో పూ పరిశోధనా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి పదిమందిలో ఆరుగురు అమెరికన్లు గాజాలో ఇజ్రాయిల్ మారణకాండను విమర్శించారు. ఇలాంటి వ్యతిరేకత 2022 నుంచి ఇరవై పాయింట్లు పెరిగింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఇజ్రాయిల్ దినోత్సవ ప్రదర్శన జరిపారు.యూదు ఓటర్ల కేంద్రం ఈ వారంలో ఒక సర్వే వివరాలను వెల్లడించింది.అమెరికా యూదుల్లో 35 ఏండ్ల లోపు వారు సగం మంది ఇజ్రా యిల్-పాలస్తీనా దేశాలు ఉండాలన్న ప్రశ్నకు మద్దతు ఇచ్చారు. సనాతనులు కాని వారు 51శాతం మద్దతు ఇచ్చారు. ఇదేదో వామపక్ష సంస్థ జరిపిన సర్వే అనుకుంటే పొరబాటు. ఉత్తర అమెరికా యూదు ఫెడరేషన్ జరిపిన సర్వేలో కేవలం 37శాతం మంది అమెరికన్ యూదులు మాత్రమే మత సంబంధ గుర్తింపును చెప్పుకున్నారు. మత వ్యతిరేకం, మతంతో సంబంధం లేదని చెప్పుకున్న వారు 18 నుంచి 34 ఏండ్ల వయస్సు వారు మూడో వంతు ఉండటం విశేషం. నెతన్యాహు అనుసరిస్తున్న విధానాల పర్యవసానాల ఫలితంగా అమెరికా యువ యూదుల్లో అసంతప్తి పెరుగుతున్నదని పరిశీలకులు ఈ సర్వే తీరుపై వ్యాఖ్యానించారు. ప్రదర్శనకు దూరంగా ఉండి మందానీ యూదులనుంచి దూరం కాలేదా అన్న ప్రశ్నకు ఇలాంటి మంత్రులను ఆహ్వానించిన వారే మెజారిటీ యూదుల నుంచి దూరమైనట్లు సమర్ధకులు తిప్పికొట్టారు.
హమాస్ సాయుధ బృందాలు 2023 అక్టోబరు ఏడవ తేదీన ఇజ్రాయిల్‌పై దాడి చేసి అనేక మందిని చంపి, కొందరిని బందీలుగా పట్టుకుపోయిన తరువాత రోజు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ మిలిటరీ హమాస్‌ను మట్టుబెట్టే పేరుతో గాజా ప్రాంతంలో 70వేల మంది సాధారణ పౌరులను హత్యచేసింది. వారిలో డెబ్బయి శాతం మంది మహిళలు, పిల్లలే. లక్షలాది గహాలను నేలమట్టం కావించింది. ఇప్పటికీ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనియన్లను గాజా నుంచి తరమివేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని అమెరికా ట్రంప్, నెతన్యాహు చెబుతున్నారు. పాలస్తీనాలోని మరొక ప్రాంతమైన వెస్ట్ బ్యాంకులో నిరంతరం యూదులను రప్పించి స్థిరనివాసాలను ఏర్పాటు చేసి యూదు మెజారిటీ ప్రాంతాలుగా చిత్రించి ఇజ్రాయెల్‌లో కలిపేందుకు లేదా వివాదాస్పద ప్రాంతాలుగా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. పాలస్తీనాకు రాజధానిగా ఉండాల్సిన తూర్పు జెరూసలెంను ఆక్రమించేందుకు చూస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించేవారు అమెరికాలో నానాటికీ పెరుగుతున్నారని ముందే చెప్పుకున్నాం. గాజాలో మారణకాండకు పాల్పడినట్లు ఐరాస కమిషన్,ఇజ్రాయిలీ, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు సైతం దాన్ని నిర్ధారించటంతో సామాన్య అమెరికన్లు కళ్లు తెరుస్తున్నారు. ఇజ్రాయిల్‌ను తొత్తుగా చేసుకున్న అమెరికా తన ప్రయోజనాల కోసం చేస్తున్న దుర్మార్గాలతో సామాన్య యూదులపై కూడా వ్యతిరేకత పెరుగుతున్నది. అయితే వారు తాము దురహంకారులం కాదని, పాలస్తీనియన్లకు వ్యతిరేకం కాదంటూ జోహ్రాన్ మందానీ వంటి వారిని ఎన్నికల్లో గెలిపిస్తూ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశ దేశాల్లో ఉన్న ఫాసిస్టు, మతశక్తులను దూరం పెట్టేందుకు ఆయా దేశాల పౌరులు జాగరూకులు కావాల్సిన తరుణం అసన్నమైంది!
ఎం కోటేశ్వరరావు
8331013288
న్యూయార్క్‌లో ఇజ్రాయిల్ దినోత్సవం బహిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


