నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు వచ్చేశారు. వారి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. ప్రస్తుతం ఒకే ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య పెరగడంతో .. కొత్త న్యాయమూర్తుల నియామకం కోరుతూ మే 16న ఆర్డినెన్స్ జారీ చేశారు. సుప్రీం కోర్టులో సుమారు 93 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, సీనియర్ న్యాయవాది వి. మోహన్ , బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ సచ్‌దేవ్, జమ్మూకశ్మీర్ అండ్ లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుణ్ పల్లి ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది చివరలో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జస్టిస్ బివి నాగరత్న మాత్రమే మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య రెండుకు చేరింది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉంటూ అదే న్యాయస్థానానికి న్యాయమూర్తి అయిన వారి సంఖ్య 12కు చేరింది. అయితే, వయసు రీత్యా కొత్త న్యాయమూర్తుల్లో ఎవరూ సీజేఐగా పదోన్నతి పొందే అవకాశం లేదు.
ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -



