Monday, August 3, 2026
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌ ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్‌

గుజరాత్‌ ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్‌

- Advertisement -

ఎస్సీ, ఎస్టీల్లో పరిస్థితి మరింత దారుణం : కేంద్ర ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ :
గత ఐదేళ్లలో గుజరాత్‌ ‌ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్స్‌ ‌సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కింద స్థాయి తరగతుల్లో వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నా.. నాలుగో తరగతికి వచ్చేసరికే బాలికల సంఖ్య భారీగా పడిపోతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంట్‌ ‌సమావేశాల్లో వెల్లడించడం విశేషం. కొన్ని రోజుల క్రితం లోక్‌‌సభకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం.. గుజరాత్‌ ‌ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతికి వచ్చే సరికి బాలికల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) గత ఐదేండ్ల క్రితం 95.8 శాతం ఉండగా, ప్రస్తుతం అది 19.3 పాయింట్లు క్షీణించి, 76.5 శాతానికి దిగజారింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో జీఈఆర్‌ ‌మరింత దిగజారిందని నివేదిక వెల్లడించింది.

షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) లకు చెందిన విద్యార్థులలో దిగువ తరగతుల్లో ఐదేండ్ల క్రితం 87.0 శాతంగా ఉన్న జిఇఆర్‌ నాలుగో తరగతికి వచ్చే సరికి 67 శాతానికి తగ్గింది. షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) విద్యార్థుల విషయానికొస్తే 96.6 శాతంగా ఉన్న జిఇఆర్‌ 70 శాతానికి తగ్గింది. నివేదికలోని వివరాల ప్రకారం గుర్తించవల్సిన ముఖ్యమైన ఏమిటంటే.. బాలికలు, ఎస్‌‌సి, ఎస్‌‌టి విద్యార్థులందరూ ప్రాథమిక ముందు దశలో అంటే ఫౌండేషన్‌ ‌దశలో గణనీయమైన నమోదుతో ఆ తర్వాత అంటే మూడు, నాలుగు తరగతుల్లోనే భారీ సంఖ్యలో పాఠశాలలకు దూరం అవుతున్నారు. గుజరాత్‌‌లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెరుగుతున్నా.. ఈ విధంగా జరుగుతుండటం గమన్హారం. లోక్‌‌సభకు తెలిపిన కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం గుజరాత్‌లో 2021-22లో 34,699 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 2025-26 నాటికి 34,734కి పెరిగాయి. అయితే ఎన్ని పాఠశాలలు మూసివేశారు, ఎన్ని విలీనం చేశారు, ఎన్ని కొత్తగా ప్రారంభించారు లేదా పునర్‌వర్గీకరించబడ్డాయి అనే వివరాలను ఈ డేటా ప్రత్యేకంగా వివరించలేదు. కాబట్టి, గుజరాత్‌‌లో పాఠశాలల మొత్తం సంఖ్య పెరగడాన్ని చూసి ఈ రాష్ర్టంలో ఎలాంటి మూసివేతలు జరగలేదనడానికి సాక్ష్యంగా భావించలేమని విద్యారంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. డ్రాపౌట్స్‌ ‌భారీగా పెరగడానికి జనాభా వలసలతో పాటు పాఠశాలల మూసివేతలు ప్రధాన కారణాలుగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. కాగా, గుజరాత్‌‌లో డ్రాపౌట్స్‌ ఎక్కువగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ నివేదికలే వెల్లడిచేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెల ప్రారంభంలో విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డిజి) పురోగతి నివేదిక ‘గుజరాత్‌‌లో సగం మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేయలేరని’ వెల్లడించింది. కళాశాల ప్రవేశాల విషయంలో దేశంలోనే గుజరాత్‌ 23వ స్థానంలో ఉంది. గుజరాత్‌లో కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే 12వ తరగతి పూర్తి చేస్తున్నారు. ఇది జాతీయ సగటు 61.14 శాతం కంటే గణనీయంగా తక్కువ. అలాగే, జాతీయ స్థాయితో పోలిస్తే భాషా ప్రావీణ్యం, గణిత నైపుణ్యంలో గుజరాత్‌ ‌విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -