సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికారం కోసం కాదు…ప్రజల హక్కులను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడటమే కమ్యూనిస్టు ఉద్యమ ధ్యేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో కూనంనేని మాట్లాడారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, విద్యా–వైద్య రంగాల ప్రయివేటీకరణ, కార్మిక–రైతు వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున నిరంతరం పోరాడుతూ, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. ఈ నెల ఆరో తేదీ నుంచి 14 వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో బలమైన డివిజన్లలో ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నామనీ, వాటిని జయప్రదం చేయాలని సీపీఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల మధ్య నిరంతరం పనిచేస్తూ సేవా దృక్పథం కలిగిన సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికల బరిలోకి దిగాలని పిలుపునిచ్చారు. కాలనీలు, బస్తీలు, శ్రామికవాడలు, పేద ప్రజల సమస్యలను తమ ఎన్నికల ఎజెండాగా తీసుకుని ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీఎస్. బోస్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థుల విజయంతో ప్రజల గొంతుక స్థానిక సంస్థల్లో బలపడుతుందనీ, అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజల హక్కుల కోసం పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



