Monday, August 3, 2026
E-PAPER
Homeజాతీయంవారం రోజుల్లోనే స్పెషల్ జడ్జి బదిలీ

వారం రోజుల్లోనే స్పెషల్ జడ్జి బదిలీ

- Advertisement -

నీట్ పేపర్ లీక్ విచారణకు ఆదిలోనే అడ్డంకులు!
మరో 137 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
జులై 25న బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ జడ్జి అను గ్రోవర్ బలిగా

న్యూఢిల్లీ: బీజేపీకి వ్యతిరేకంగా సీజేపీ ఉద్యమం షురూ చేసినప్పటినుంచి దాన్ని ఎలాగైనా అడ్డంకులు కల్పించటానికి మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజేపీపై విమర్శలు చేయటానికి కేంద్రమంత్రులు, బీజేపీ నేతల్ని రంగంలోకి దింపింది. తాజాగా పేపర్ లీక్ కేసులను విచారించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్-ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి అను గ్రోవర్ బలిగా ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆమెతో పాటు మరో 137 మంది న్యాయమూర్తులను కూడా బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జులై 25న బాధ్యతలు స్వీకరించిన స్పెషల్ జడ్జ్ అనుగ్రోవర్ బలిగా… ఆ ప్రత్యేక కోర్టులో కేవలం వారం పాటే సేవలందించారు. గ్రోవల్ బలిగా స్థానంలో స్పెషల్ జడ్జి అజయ్ గుప్తా నియమితులయ్యారు. ఉగ్రవాద కేసులను విచారించేందుకు జడ్జి బలిగాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చట్టం కింద ఉన్న ఒక ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఆమెతో పాటు న్యాయమూర్తులు వికాస్ ధుల్, ప్రశాంత్ శర్మ, పులస్త్య ప్రమచల, కిరణ్ బన్సల్, అమిత్ బన్సల్ కూడా ఎన్ఐఏ జడ్జిలుగా నియమించారు. కాగా, పేపర్ లీక్‌ల కేసులను వేగంగా పరిష్కరించడానికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ఇటీవలే ప్రకటించిన విషయం విదితమే.

నీట్ పేపర్ లీక్ కేసులో మొదటి విచారణ జులై 27న జరిగింది. అయితే, డిఫెన్స్ కౌన్సిల్ అభ్యర్థన మేరకు విచారణ వాయిదా పడింది. అనంతరం, సీబీఐ చార్జిషీట్, ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లను పరిశీలించేందుకు జడ్జి ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసులో సీబీఐ 13 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విదితమే. వారందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీక్ అవకతవకలు, ఇటీవల జరిగిన నిరసనల్లో పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

​ఆ చర్యలపై సిట్ ఏర్పాటు!
నిరసనకారులు, పెల్లెట్ గన్ బాధితుల ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే యోచనలో న్యాయస్థానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసులపై దాడులకు పాల్పడింది పోలీసులా? లేక సంఘవిద్రోహ శక్తులా అని నిర్ధారించేందుకు దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ పిటిషన్లలో కోర్టు సూచించింది. అలాగే, 18 ఏండ్ల లోపు వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదనే షరతుపై వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా విచారణ జరగాలని, ఎవరైతే అతిక్రమణలకు పాల్పడి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా, నిరసనకారులపై పెల్లెట్ గన్లు, మేకులు దింపిన లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, ఎలక్ట్రిక్ లాఠీలను ఉపయోగించడం వల్ల పలువురు విద్యార్థులు, యువతులు తీవ్రంగా గాయపడ్డారనే ఆరోపణలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిరసనలు జరిగిన రాష్ట్రాలకు, ఆందోళనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ రికార్డింగ్‌లు, వైర్‌లెస్ కమ్యూనికేషన్ రికార్డులు, పీసీఆర్ లాగ్‌లు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచాలని కోర్టు పలు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

​అసలేం జరిగింది?
జులై 20న ఢిల్లీలో నేతృత్వంలో జరిగిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, నిరసనకారులు భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చి అనేక ఇతర రాష్ట్రాలకు వ్యాపించాయి. నీట్ పేపర్ లీక్ విషయంపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అనంతరం, ప్రధాన్ రాజీనామాతో, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదనే డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించడంతో ఆందోళన ముగిసింది.

పరీక్షల్లో అవకతవకలు ఆ 158 కేసులపై సీబీ‘ఐ’
నియామక పరీక్షల్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా అనేక కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తు న్న సంగతి తెలిసిందే. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం 158 కేసుల్లో దర్యాప్తు పూర్తయినప్పటికీ.. వివిధ కోర్టుల్లో అవి విచారణ దశలోనే ఉండిపోయినట్టు సమాచారం. వీటిలో కొన్ని 20ఏండ్ల నాటి కేసులు ఉండటం గమనార్హం. దీంతో.. వీటిని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులకు బదిలీ చేయాలని అన్ని హైకోర్టులను ఆశ్రయించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దేశ రాజధానిలోనే 2000 నుంచి దాదాపు 25 కేసులు విచారణ దశలో ఉన్నట్టు తెలిసింది. వీటిలో ఎయిమ్స్‌ పీజీ నియామక పరీక్ష 2010-11, ఢిల్లీ యూనివర్సిటీ మెడికల్‌, డెంటల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ 2011, క్యాట్‌-2004, ఎస్‌ఎస్‌సీ-2013, టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ సంబంధిత కేసులు ఉన్నట్టు తెలిసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, యూపీ, రాజస్తాన్‌, బీహార్‌, జార్ఖండ్‌, కర్నాటక, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోనూ అనేక కేసులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -