మచ్చ కన్నయ్యకు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నివాళి
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయ రాఘవన్, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం
కొత్తగూడెం మెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
నవతెలంగాణ-భద్రాచలం/కొత్తగూడెం
సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు తండ్రి మచ్చ కన్నయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ఐదు గంటలకు మృతిచెందారు. మచ్చ కన్నయ్య మరణ వార్త తెలుసుకున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ నిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కన్నయ్య చర్ల మండలంలో అంబేద్కర్ నగర్ గ్రామ పెద్దగా సుదీర్ఘకాలం సేవలందించారని అన్నారు. అంబేద్కర్ నగర్ ఏర్పాటుతోపాటు మౌలిక సదుపాయాల కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. మొదటి నుంచి వామపక్ష భావాలు కలిగిన మచ్చ కన్నయ్య తన ఇద్దరు కుమారులను మార్క్సిస్టు పార్టీ నాయకులుగా తీర్చిదిద్దారని అన్నారు. పెద్ద కుమారుడు మచ్చ వెంకటేశ్వర్లు.. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తుండగా, ద్వితీయ కుమారుడైన మచ్చ రామారావు సైతం పార్టీ చర్ల మండల కార్యదర్శిగా ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. అలాగే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు, బుర్రి ప్రసాద్ తదితరులు ఆస్పత్రిలో కన్నయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి అప్పగింత
మచ్చ కన్నయ్య భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామమైన భద్రాద్రి జిల్లా చర్లకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధన నిమిత్తం కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అప్పగించారు. మచ్చ కుటుంబ సభ్యులు ప్రగతిశీల భావాలతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు అభినందించారు.
మచ్చ కన్నయ్య మృతికి సీపీఐ(ఎం) నేతల సంతాపం
మచ్చ వెంకటేశ్వర్లు తండ్రి అయిన మచ్చ కన్నయ్య మృతి విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, విజయరాఘవన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తమ సంతాపాన్ని తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నాయకులు మీడియం బాబురావు, సీనియర్ నాయకులు సోమయ్య తమ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.
సీపీఐ(ఎం) భద్రాద్రి జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లుకు పితృవియోగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



