హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించ తలపెట్టిన జనసేన సాధకుల సమావేశానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం నిర్వహించేందుకు జనసేన పార్టీ అనుమతి కోరగా సైబరాబాద్ పోలీసులు శాంతిభద్రతల కారణాలను చూపుతూ అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాంప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. సుమారు రెండు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది.
పంచాయతీ భవనానికి ‘రాజిరెడ్డి భవన్’ పేరు పెట్టండి రాష్ట్ర సర్కార్‌ను ఆదేశించిన హైకోర్టు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి ‘రాజిరెడ్డి భవన్’గా నామకరణం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంపై ‘రాజిరెడ్డి భవన్’ అని స్పష్టంగా కనిపించేలా బోర్డు ఏర్పాటు చేసి నాలుగు వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ అధికారులకు జస్టిస్ నగేశ్ భీమపాక ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గ్రామాభి వృద్ధికి విశేష సేవలు అందించారనీ, ఆయన పేరును గ్రామ పంచాయతీ భవనానికి పెట్టాలని గ్రామ పంచాయతీ 2017లో ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 24న జీవో నెం.96 జారీ చేసినప్పటికీ అధికారులు అమలు చేయలేదని ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు రామవరం మాధవిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు పరిశీలించిన న్యాయస్థానం, జీవో 96 ఇప్పటికీ అమల్లోనే ఉందనీ, ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం అధికారుల బాధ్యతేనని స్పష్టం చేసింది.
హైకోర్టులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పోలీసు వందనాన్ని స్వీకరించిన అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాం కోషి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జనసేన సభ నిర్వహణ పిటిషన్ తిరస్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



