నవతెలంగాణ -పరకాల : పరకాల పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న మహమ్మద్ షరీఫుద్దీన్ (36) మరణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మొదట రోడ్డు ప్రమాదంగా భావించిన ఈ ఘటన, ఇప్పుడు హత్యగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటంతో సంచలనంగా మారింది.
నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫుద్దీన్, ప్రస్తుతం పరకాలలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో షరీఫుద్దీన్‌కు ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి పిలవడంతో హతుడు బయటకు వెళ్లారు. కాసేపటికే, వెల్లంపల్లి రోడ్డులోని నజరేతు ప్రార్థన మందిరం ఎదురుగా ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని 108 సిబ్బంది ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
అయితే, ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యులు ఘాటుగా ఆరోపిస్తున్నారు. సమీపంలోని ఒక రేకుల షెడ్డులో షరీఫుద్దీన్‌ను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత నేరాన్ని పక్కదారి పట్టించేందుకు, మృతదేహాన్ని వెల్లంపల్లి ప్రధాన రహదారిపై పడేశారని వారు వాదిస్తున్నారు. షరీఫుద్దీన్‌కు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వాలు లేవని, రాత్రి వచ్చిన ఫోన్ కాల్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు..
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పరకాల పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాల్ డేటా, ఘటనా స్థలం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ మరణం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరన్నది త్వరలోనే తేలుస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
రాత్రి పూట వచ్చిన ఆ ఫోన్ కాల్ ఎవరిది..?
షరీఫుద్దీన్‌ను చివరిసారిగా కలిసిన వారు ఎవరు..? అన్న అంశాలే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణలో ఏవైనా కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
పరకాలలో దారుణ హత్య…తీవ్ర కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



