పురుషులు కంటే మహిళలే అధికం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటు ఇంటి పని..అటుకూలీ పని..రెండింటిని సమన్వయం చేసుకుంటూ మండలలోని మహిళలు ఉపాధి పథకంలో పనులు చేస్తూ తమ శ్రమను నమ్ముకొని కుటుంబాలను పోషిస్తూ తామేంటో నిరూపిస్తున్నారు.మండలంలో ఉపాధికి వెళ్తున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం విశేషం. మండలంలో మొత్తం 3,592 మంది పనులు చేస్తుండగా ఇందులో 2192 మంది మహిళలుండగా 1400 పురుషులు ఉన్నారు.మహిళలే ఉండి,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారు.వేసవి సెగలు పడుతున్నా లెక్కచేయకుండా,తెల్లవారు జామున 6 గంటలకే పనుల్లో పాల్గొంటున్నారు.
దక్కుతున్న వేతనం..
చెరువుల్లో పూడికతీత నుంచి పొలాల,చెనుల్లో మొక్కలు నాటడం వరకు ప్రతి పనుల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.రోజుకు రూ.300 నుంచి రూ.307 వరకు వేతనం పొందుతూ వ్యవసాయ పనులు లేని ఎండాకాలంలో తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.ప్రభుత్వం కల్పించే 100 రోజుల పనిని లక్ష్యంగా పెట్టుకుని మహిళలు శ్రమిస్తున్నారు.
భత్యం ఇస్తే..మరింత ఊరట
పనిపట్ల నిబద్ధత ఉన్నా..ఎండల తీవ్రత దృష్ట్యా గతంలో ఇచ్చే వేసవిభత్యం మళ్లీ ప్రారంభించాలని కూలీలు కోరుతున్నారు.పని ప్రదేశంలో వసతులు కల్పించడంతో పాటు,అదనపు వేతనం అందిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తామని కూలీలు ఆశిస్తున్నారు.తమ కష్టానికి తగిన గుర్తింపు, అదనపు సాయం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు.
ఉపాధే ఆధారం..మహిళలు
ఎండాకాలంలో గ్రామంలో పనులు లేకపోవడంతో ఉపాధి పనులే మమ్మల్ని ఆదుకుంటున్నాయని మహిళ కూలీలు అంటున్నారు.వచ్చే కూలీతోనే ఇంటి ఖర్చులు సాగుతున్నాయని చెబుతున్నారు.వచ్చే కొద్దిపాటి డబ్బులు సకాలంలో ఇవ్వరు. పని చేసి ఎదురు చూడాల్సివస్తోందని అధికారులు,పాలకులు కూలీడ బ్బులు త్వరగా వచ్చేలా చూడాలని కోరుతున్నారు.పొద్దున్నే 6గంటలకు పనుల కు వస్తున్నాం.ఎండలు ఎక్కువగా ఉండటంతో పని చేయడం కష్టమవుతోంది.ప్ర భుత్వం గుర్తించి కూలీని మరింత పెంచాలి.మార్కెట్లో ధరలు పెరిగాయి, డబ్బులు పెంచడం లేదు.
పనులు వినియోగించుకోవాలి: ఎంపిడిఓ..క్రాంతికుమార్
మహిళాకూలీలు ఉత్సాహంగా పనులకు వస్తున్నారు. వారికి ఇబ్బంది కలగకుండా ఉదయాన్నే పనులు ముగించేలా వెసులుబాటు కల్పిస్తున్నాం.ఉపాధిలో ఎలాంటి అవకతవకలు లేకుండా ముఖగుర్తింపు చేస్తున్నారు.



