సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ -పరకాల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను అవలంబిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపతి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఎఫ్‌జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల రెండో రోజు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల చక్రపాణి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపతి వెంకటేశ్వర్లు “మతం – మతోన్మాదం” అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని విమర్శించారు.
దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతుల ప్రయోజనాలను కాపాడే చట్టాలను బలహీనపరుస్తూ నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలను పెంచుతోందని అన్నారు. ఈ సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు హిందుత్వ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
దేశ రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక, సామ్యవాద విలువలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు అనుకూల విధానాలు, ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు నిర్మించాలని భూపతి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు టీ. ఉప్పలయ్య, గొడుగు వెంకట్, కె. లింగయ్య, దొగ్గెల తిరుపతి, పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్, నాయకులు బొచ్చు ఆదాం, జి. మహేందర్, ఈశ్వర్, హేమంత్ చరణ్, రౌతు శ్రీలత, మోహన్, కమల్ తదితరులు పాల్గొన్నారు.



