మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
ధాన్యం సేకరించని అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన
రైతులతో కలిసి మద్దూరులో సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, మద్దూరు
మెదక్ కలెక్టరేట్ ఎదుట ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని లారీలు లేక తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి, గాజిరెడ్డిపల్లి, వాడితో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు ట్రాక్టర్లలో బుధవారం మెదక్ కలెక్టరేట్‌కు వచ్చారు. అధికారుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో మెదక్ – రామాయంపేట రహదారి, కలెక్టర్ ప్రధాన ద్వారం వద్ద బైటాయించారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరో వారం రోజుల్లో వర్షాకాలం వస్తుందని, పండించిన ధాన్యం తడిసిపోతే తమ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో బూరుగుపల్లికి చెందిన రైతు యేసు పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రైౖతుల ధాన్యం సేకరించి ట్రక్ షీట్ ఇచ్చి ధాన్యం దించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని బుధవారం మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో రైతులు గ్రామస్తులతో కలిసి వడ్ల బస్తాలు రోడ్డుమీద వేసి ధర్నా నిర్వహించారు. వీరికి సీపీఐ(ఎం) నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.
రైతుల ఆందోళనతో రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో మద్దూరు తహసీల్దార్ ఏజీ రహీమ్, ఎస్ఐ అసిఫ్.. ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో, సీపీఐ(ఎం) నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ.. వల్లంపట్లలో వారం రోజులుగా 75శాతం వడ్లు కాంటాలు పెట్టి నిలువ ఉంచారని, వర్షం పడితే రైతుల పరిస్థితి ఏంటి అని అధికారులను నిలదీశారు. పీఏసీఎస్ అధికారులను, కొనుగోలు కేంద్ర నిర్వాహకులను రైతులు నిలదీయగా ప్రయివేట్ వాహనంలో తీసుకువెళ్లాలని సూచించడం దారుణమన్నారు. రైతులు వడ్లు కాంటపెట్టి లోడు ట్రక్ షీట్లు ఇచ్చి దూల్మిట్ట పీఏసీఎస్t గోదాము అలాట్మెంట్ చేశారని, అక్కడ ధాన్యం దించుకోమని గోదాము నిర్వాహకులు తెలపడంతో రైతులు ఆందోళనకు గురయ్యారన్నారు. కొనుగోలు కేంద్రంలో బస్తాకు రెండు కిలోలు కట్ చేయగా రైస్ మిల్లర్లు క్వింటాలుకు నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని, మరోపక్క లారీల యజమానులు వెయిటింగ్ చార్జీ పేరు మీద బస్తాకు మూడు నుంచి ఐదు రూపాయలు రైతుల దగ్గర వసూలు చేస్తున్నా రని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో తహసీల్దార్ స్పందించి.. పీఎస్సీఎస్ అధికారులతో, రైస్ మిల్లర్లతో వడ్లు దించుకునే విధంగా మాట్లాడి.. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఖాళీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
రైతుల జీవితాలతో చెలగాటమా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



