Thursday, June 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకన్సల్టెన్సీల కనుసన్నల్లో ‘ఇంజినీరింగ్‌’ దందా!

కన్సల్టెన్సీల కనుసన్నల్లో ‘ఇంజినీరింగ్‌’ దందా!

- Advertisement -

కాలేజీలో సీటు రూ.45 లక్ష‍లు! ఇందులో డొనేషన్‌ రూ.25.80 లక్ష‍లు
సీఎస్‌ఈ కోర్సుకు భారీ డిమాండ్‌
ఉన్నత విద్య పేరుతో
ప్రయివేటు కాలేజీల అక్రమ వ్యాపారం
కనిపించని టీఏఎఫ్‌ఆర్సీ నిబంధనలు
పట్టించుకోని ప్రభుత్వం
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యార్థి తండ్రి : సార్‌ ఇంజినీరింగ్‌ సీటు కావాలి
కన్సల్టెన్సీ : సీట్లు ఉన్నాయి. ఏ కోర్సులో కావాలి
తండ్రి : సీఎస్‌ఈ కోర్సులో సీటు కావాలి
కన్సల్టెన్సీ : ఏ కాలేజీలో సీటు కావాలి
తండ్రి : సీబీఐటీలో సీటు కావాలి
కన్సల్టెన్సీ : ఇంటర్‌‌లో ఎన్ని మార్కులు వచ్చాయి
తండ్రి : 890 మార్కులు వచ్చాయి
కన్సల్టెన్సీ : జేఈఈ మెయిన్‌‌లో అర్హత సాధించారా
తండ్రి : లేదు
కన్సల్టెన్సీ : సీబీఐటీలో సీఎస్‌ఈ సీటు కావాలంటే ఎన్‌ఆర్‌ఐ కోటా కింద రూ.45 లక్ష‍లు అవుతుంది
తండ్రి : ఫీజును చెక్కు రూపంలో, ఆన్‌‌లైన్‌‌లో కట్టవచ్చా?
కన్సల్టెన్సీ : అలా ఉండదు. డొనేషన్‌ ‌రూ.25.80 లక్ష‍లు క్యాష్‌ ‌రూపంలో వెంటనే ఇవ్వాలి. మిగిలిన కాలేజీ ఫీజు రూ.19.20 లక్ష‍లు (ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ ‌కోటా కింద ఏడాదికి రూ.ఐదు వేల డాలర్లు కట్టాలి. ప్రస్తుతం డాలర్‌‌కు రూ.96 ఉన్నందున రూ.19.20 లక్ష‍లు అవుతుంది) నాలుగేండ్లలో చెల్లించాలి. అది కూడా టర్మ్‌ ‌ఫీజు లేదా ఏడాదికి ఒకేసారి కట్టాలి.
తండ్రి : ఫీజు తగ్గుతుందా?
కన్సల్టెన్సీ : ఎంజీఐటీలో అయితే రూ.25 లక్ష‍లకే సీఎస్‌ఈలో సీటు వస్తుంది.
తండ్రి : సీబీఐటీలోనే సీటు కావాలి
కన్సల్టెన్సీ : రూ.ఐదు లక్ష‍లు తగ్గే అవకాశం ఉంది. తండ్రి : రిసిప్ట్‌ ఇస్తారా
కన్సల్టెన్సీ : డొనేషన్‌‌కు రిసిప్ట్‌ ఉండదు. కాలేజీలో కట్టే ఫీజుకు మాత్రమే రిసిప్ట్‌ ఉంటుంది.

ఇది ఓ కన్సల్టెన్సీ ప్రతినిధితో విద్యార్థి తండ్రి మాట్లాడిన మాటలు. ఇదీ ఏదోఒక ఇంజినీరింగ్‌ కాలేజీలోని పరిస్థితి కాదు. దాదాపు అన్ని ఇంజినీరింగ్‌ కాలేజీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. యాజమాన్య కోటాలో ఉన్న ఇంజినీరింగ్‌ ‌సీట్లకు డొనేషన్‌ కడితేనే సీట్లు దొరుకుతాయి. లేదంటే సీట్లు లేవు అని యాజమాన్యాలు చెప్తాయి. కొన్ని కాలేజీలు నేరుగా సీట్లకు సంబంధించిన బేరసారాలు నడిపిస్తాయి. కొన్ని కాలేజీలు కన్సల్టెన్సీల ద్వారా సీట్లు భర్తీ చేస్తాయి. పద్ధతి ఏదైనా డొనేషన్‌ ‌చెల్లించాల్సిందే. ప్రముఖ ఇంజినీరింగ్‌ ‌కాలేజీల్లో సీఎస్‌ఈ సీటుకు రూ.ఐదు లక్ష‍ల నుంచి రూ.25 లక్ష‍ల వరకు డొనేషన్‌ ‌కట్టాల్సిన పరిస్థితి ఉన్నది.
సీఎస్‌ఈ కోర్సుకు భారీ డిమాండ్‌ ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆ బలహీనతను ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు క్యాష్‌ ‌చేసుకుంటున్నాయి. ఎప్‌‌సెట్‌ ‌ఫలితాలు విడుదలైనా ఇంకా ఇంజినీరింగ్‌ ‌ప్రవేశాల కౌన్సెలింగ్‌ ‌షెడ్యూల్‌‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. అయినప్పటికీ ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు విద్యావ్యాపారం యధేచ్చగా సాగుతోంది. ఏటా ఇలా తంతు. దీనిపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ‌ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) నిబంధనలకు కాలేజీలు తిలోదకాలు ఇస్తున్నాయి. బీ కేటగిరీ సీట్లను డొనేషన్లను తీసుకుని అమ్ముకుంటున్నాయి. దీంతో మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది.

బీ కేటగిరీ సీట్ల భర్తీ దందా
రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా ద్వారా, 30 శాతం సీట్లు బీ కేటగిరీ (15 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ లేదా ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా) ద్వారా భర్తీ చేయాలి. అయితే బీ కేటగిరీ సీట్లకూ కన్వీనర్‌ కోటా ఫీజు మాత్రమే వసూలు చేయాలి. కానీ చాలా కాలేజీలు డొనేషన్లు తీసుకుని ఎక్కువ ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో 50 శాతంపైగా మార్కులు సాధించిన అభ్యర్థులకే బీ కేటగిరీ సీట్లు ఇవ్వాలి. జేఈఈ మెయిన్‌లో ర్యాం‌కు వచ్చిన వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా సీట్లు మిగిలితే ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా మెరిట్‌ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలి. ఇంకా మిగిలి ఉంటే ఇంటర్‌లో ఉత్తీర్ణత పొందిన వారికి మార్కుల ఆధారంగా ఇవ్వాలని నిబంధనలున్నాయి. కానీ ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారమంతా ఉన్నత విద్యామండలి అధికారులకు తెలిసినా అధికారింగా ఎలాంటి ఫిర్యాదులు అందలేదనే సాకుతో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. డొనేషన్లు తీసుకుని బీ కేటగిరీ సీట్లను అమ్ముకుంటూ ఫీజుల దందాకు పాల్పడుతున్న ఇంజినీరింగ్‌ ‌కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. బీ కేటగిరీ సీట్లను ఆన్‌‌లైన్‌ ‌ద్వారా మెరిట్‌ ‌ప్రకారం భర్తీ చేయాలని కోరుతున్నాయి.

విచారణ జరపాలి
టీఏఎఫ్‌ఆర్సీ నిబంధనలను ఉల్లంఘించి రూ.లక్షల ఫీజును డొనేషన్ల రూపంలో ఇంజినీరింగ్‌ ‌కాలేజీల ‌యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. వీటిపై విచారణ కమిటీ వేసి తగిన చర్యలు తీసుకోవాలి. చాలా కాలేజీలు కొన్నేండ్లుగా అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం జీతాలు చెల్లించినట్టుగా, నిబంధనలను పాటించినట్టుగా నివేదికలు వెళ్తున్నాయి. ఈ కాలేజీల అక్రమాలపై విచారణ జరిపాలి.
సంతోష్‌కుమార్‌, తెలంగాణ స్కూల్‌ ‌‌అండ్‌ టెక్నికల్‌ ‌కళాశాలల ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (టీఎస్‌‌టీసీఈఏ) అధ్యక్ష‍ులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -