Thursday, June 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ భూమి పుత్రుల జాగీరే

తెలంగాణ భూమి పుత్రుల జాగీరే

- Advertisement -

ఇది కమ్యూనిస్టులు కదం తొక్కిన నేల
దేశభక్తి గురించి పవన్‌ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు
బండి భగీరథ్‌ను కాపాడింది రేవంత్‌‌రెడ్డి కాదా?
420 హామీలను అమలు చేస్తే పోటీ చేయం
‌మీట్‌ ద మీడియాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ కచ్చితంగా భూమి పుత్రుల జాగీరేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌‌లో ప్రెస్‌‌క్లబ్‌ ఆధ్వర్యంలో మీట్‌ ‌ద మీడియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పవన్‌‌ కళ్యాణ్‌ను ఏపీ ఉపముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. కళాకారుడిగా, నటుడిగా అభిమానిస్తాం. సోదరుడిగా ఇంటికొస్తే బిర్యానీ పెడతాం. కానీ మా సెక్రెటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం’అని అన్నారు. ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదని తెలిపారు. ఇది నెత్తురుతో తడిచిన నేల అని అన్నారు. ఇక్కడున్న నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరేనని చెప్పారు. ఆయన, ఆయన కుటుంబం ఇక్కడే ఉందనీ, వ్యాపారాలు చేసుకోవచ్చనీ, ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని చెప్పారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్‌ అన్నారని గుర్తు చేశారు.

మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారనీ, అది కూడా ప్రాంతీయవాదం అంటారా? అని పవన్‌ ‌కళ్యాణ్‌‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన పరిశ్రమలను గుజరాత్‌‌కు తీసుకెళ్లారని అన్నారు. జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా?అని ప్రశ్నించారు. మోడీ గుజరాత్‌కే ప్రధానిగా వ్యవహరించడం కరెక్టా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఏర్పడితే అన్నం తినని పవన్‌ ‌తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌‌లో సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల ఇదనీ, కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల అని చెప్పారు. తమకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్తకాదని అన్నారు.

పవన్ కళ్యాణ్‌ది ఇటీవలే ‘ఓజీ’ సినిమా వచ్చిందనీ, తెలంగాణ ఓజీ కేసీఆరేనని స్పష్టం చేశారు. ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చనీ, ఎక్కడైనా పోటీ చేయొచ్చని అన్నారు. అయితే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష‍లు, సంస్కృతిని గౌరవించాలని సూచించారు. 2023లో జనసేన పోటీ చేయలేదా? ఇక్కడ కొత్తగా పోటీ చేసేది ఏముందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందనీ, ఎగిరేది గులాబీ జెండాయేననీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు. పోక్సో నిందితుడు బండి భగీరథ్‌ను తొమ్మిది రోజులు కాపాడింది ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి కాదా?అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్‌ ‌చేసినా చర్యల్లేవని అన్నారు. 2014లో తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.50 కోట్ల ఎకరాలనీ, 2023 నాటికి అది రూ.2.29 కోట్ల ఎకరాలకు పెరిగిందని వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అమలు చేశామని చెప్పారు. రైతుబంధు పథకాన్ని తెచ్చామన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టామని వివరించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. తాను చెప్పినవన్నీ నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని అన్నారు.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను అమలు చేస్తే బీఆర్‌ఎస్‌ ‌పోటీ చేయకుండా ఉంటుందనీ, అమలు చేయకుంటే కాంగ్రెస్‌ ‌పోటీ చేయకుండా ఉంటుందా?అని సవాల్‌ ‌విసిరారు. ఫ్యూచర్‌ ‌సిటీ ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూమి అని అన్నారు. రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం కోసం కాదన్నారు. అక్కడ వంతారా జూపార్క్‌‌ను ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ఫార్మా పరిశ్రమలు, వంతారా జూపార్క్‌ ‌పక్కన జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు తీసుకుంటారా?అని అడిగారు. ఫ్యూచర్‌ ‌సిటీని రద్దు చేస్తామన్న హరీశ్‌‌రావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం రేవంత్‌‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంచిరేవుల, బుద్వేల్‌, పేట్‌ ‌బషీరాబాద్‌‌లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే మీడియా అకాడమి, ప్రెస్‌‌క్లబ్‌, ప్రభుత్వం కలిసి కమిటీ వేస్తామనీ, ఎక్కడ సూచిస్తే అక్కడ ఇండ్ల స్థలాలను ఇస్తామన్నారు.

వచ్చే ఏడాది పాదయాత్ర చేపడతానని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నట్టు, తాను కేంద్రమంత్రి అయినట్టు ఊహాజనితమైన స్క్రిప్ట్‌ ‌బాగుందనీ, సినిమా తీస్తే బాహుబలి కంటే పెద్ద హిట్‌ అవుతుందని చెప్పారు. తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డిని ఓడిస్తామని అన్నారు. ఉచిత విద్యుత్‌ ‌గురించి మాట్లాడే హక్కు రేవంత్‌‌రెడ్డికి లేదన్నారు. ప్రెస్‌‌క్లబ్‌ మాజీ అధ్యక్ష‍ులు రవికాంత్‌‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రెస్‌‌క్లబ్‌ అధ్యక్ష‍ులు ఎస్‌ విజయ్‌‌కుమార్‌‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల ‌రమేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -