లిస్బన్ : పోర్చగల్ ప్రధాని లూయిస్ మాంటెనెగ్రో ప్రతిపాదించిన కార్మిక సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ పిలుపు మేరకు బుధవారం ఆ దేశ రాజధాని లిస్బన్ వేలాది మంది ప్రజలు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అయితే శాంతియుతంగా చేస్తున్న వీరి ఆందోళనలను పోలీసులు హింసాత్మకంగా అణచివేశారు. పార్లమెంటులో చర్చకు రానున్న ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాని ప్రతిపాదన కార్మిక హక్కులపై దాడి చేస్తోందని ట్రేడ్ యూనియన్స్ తీవ్రంగా ఖండిస్తున్నాయి. కార్మిక హక్కుల్ని అణచివేసే ఈ బిల్లును తక్షణమే ఉపసంహించుకోవాలని లూయిస్ ప్రభుత్వాన్ని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పనిగంటల పెంపు, ఉద్యోగుల తొలగింపు నిబంధనల్ని సులభతరం చేయడం, మెటర్నెటీ, పెటర్నెటీ (మాతృత్వ, పితృత్వ) రక్షణ హక్కుల్ని తీవ్రంగా దెబ్బతీసేలా రూపొందించిన కార్మిక సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన సమ్మెలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంటు వెలుపల చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొన్న నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు భద్రతాదళాలు, పోలీసులు ప్రయత్నించారు. నిరసకారులపై లాఠీఛార్జీ ప్రయోగించారు.
ముగ్గురు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ నిరసనలో పాల్గొన్న జనరల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ పోర్చుగీస్ వర్కర్స్-నేషనల్ ఇంటర్ సిండికల్ (సిజిటిపి-ఐఎన్) ప్రధాన కార్యదర్శి టియాగో ఒలివరా మాట్లాడుతూ.. ‘ఈ చట్టాన్ని తిరస్కరించడానికి మాకు ఇదే సరైన సమయం అని అభిప్రాయపడ్డాం. అందుకే సమ్మెకు పిలుపునిచ్చాం. సంప్రదాయవాద ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాము ’ అని ఆయన అన్నారు. ఆర్థిక వృద్ధి కోసమే లేబర్ కోడ్ సంస్కరణలు తెచ్చినట్లు పోర్చుగీస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది కేవలం ఒక సాకు మాత్రమేనని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేవలం కార్మిక సంఘాలను బలహీనపరచడం, పని గంటలను పెంచడం, సమ్మె చేసే రాజ్యాంగ హక్కును పూర్తిగా నిర్మూలించడనికే ప్రధాని లూయిస్ మాంటెనెగ్రో ఈ సంస్కరణలు చేపట్టారని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తున్న పోర్చుగల్ ప్రభుత్వం.. తాజాగా ప్రవేశపెట్టనున్న కార్మిక సంస్కరణల బిల్లు కార్మికులకు రక్షణ కల్పించే 100కు పైగా నిబంధనల్ని తొలగిస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. కార్మికులు అక్కడ అదనంగా రెండు గంటలు పనిచేయాలి. మొత్తంగా సంవత్సరానికి 150 గంటలు అదనంగా పనిచేయాలి. ఈ అదనపు పని గంటల్ని పెంచడం ద్వారా.. కార్మికుల శ్రమను దోచుకుని.. కార్పొరేట్లకు లాభాలను కూడబెట్టడానికేనని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
కార్మిక సంస్కరణలను వ్యతిరేకిస్తూ పోర్చుగల్‌లో సార్వత్రిక సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



