Friday, June 5, 2026
E-PAPER
Homeజాతీయంఎనిమిదిమంది కుటుంబ సభ్యుల సజీవ దహనం

ఎనిమిదిమంది కుటుంబ సభ్యుల సజీవ దహనం

- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హోటల్ ప్రమాదంలో గాలింపు చర్యలు గురువారంతో ముగిసాయి. మాల్వీయా నగర్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ దహనమవడం మరింత విషాదకరం. ఈ సంఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ నివాసి అయిన రాధే శ్యామ్ అగర్వాల్ అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం ఢిల్లీకి వచ్చారు. ఆయన ప్రస్తుతం మ్యాక్స్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్నారు. రాధే శ్యామ్ కోసం ఆయన భార్య ప్రేమ్ లత, కుమారుడు వివేక్ అగర్వాల్, కోడలు తర్జని, ఇద్దరు మనవరాళ్లు జీవిష్క, వారియా ఢిల్లీకి వచ్చారు. వీరంతా రాధే శ్యామ్ అగర్వాల్‌కు దగ్గరగా ఉండేందుకు ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్లో బస చేస్తున్నారు. రాధే శ్యామ్ ను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్‌లోని కిషన్‌గఢ్ నుండి వివేక్ అత్త, మామలు కమల, ఝిమ్రి లాల్ అగర్వాల్‌లు, కజిన్ అశోక్ గోయల్ ఇదే హోటల్ దిగారు.

బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఈ ఎనిమిది మందీ సజీవ దహనమయ్యారు. వివేక్ కుటుంబం బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయిందని సమాచారం రాగానే వారి బంధువులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నా ఎవరినీ రక్షించలేకపోయారు. “రాధే శ్యామ్ ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెప్పారు. అందుకే దగ్గరి బంధువులందరూ దూర ప్రాంతాల నుండి వచ్చారు“ అని ఒక బంధువు సరిత అన్నారు. “ రాధే శ్యామ్‌కు దీని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు“ అని ఆమె తెలిపారు. ప్రమాదం జరుగుతున్నప్పుడు హోటల్ షట్టర్లను తెరిచేందుకు ఢిల్లీ అగ్నిమాపక శాఖ వద్ద తగిన పరికరాలు లేవని, దీంతో తాము, స్థానికులు కలిసి కిటికీలను పగులగొట్టి, అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించామని ఒక బంధువు తెలిపారు.

హోటల్‌ ‌యజమానికి పోలీస్‌ ‌కస్టడీ
ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్ యజమాని లవకేష్ బజాజ్‌కు గురువారం ఢిల్లీ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. లవకేష్ బజాజ్ కు నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించడానికి అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భాను ప్రతాప్ సింగ్ ఆమోదించారు. యజమాని లవకేష్ పై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) లోని సెక్షన్లు 105 (హత్యాయత్నం), 326(జి) (అగ్ని ప్రమాదాల ద్వారా ఆస్తి నష్టం కలిగించే నేరం), 324(5) (ఆస్తులకు నష్టం కలిగించడం), 125(ఎ) (మానవ ప్రాణాలకు, భద్రతకు ముప్పు కలిగించే నిర్లక్ష్యపు చర్య), 125(బి) (నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన గాయాలు కలిగించడం), 287 (అగ్ని సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యపు ప్రవర్తన) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై హోటల్ సిబ్బందిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో అన్ని హోటళ్లు, నర్సింగ్ హోమ్‌లలో అగ్నిమాపక భద్రతా నిబంధనల అమలును తనిఖీ చేస్తూ నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -