ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలితో ప్రధాని చర్చలు
న్యూఢిల్లీ : ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగజ్‌తో గురువారం ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. బుధవారం ఇక్కడకు వచ్చిన రొడ్రిగజ్ గురువారం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా ఈ చర్చలు సాగాయి. ఆమె వెంట వచ్చిన ప్రతినిధి బృందంలో విదేశీ, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, రవాణా మంత్రులతో పాటు పలువురు మంత్రులు వున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన సరఫరాలకు ఆటంకం కలుగుతున్నందున ముడిచమురు సేకరణను వైవిధ్యపరచాలని భారత్ భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ 4.3 శాతం తక్కువగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ధరలు మాత్రం 50శాతానికి పైగా పెరిగాయి. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలి పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బలగాలు నిర్బంధంలోకి తీసుకోవడంతో డెల్సీ రొడ్రిగజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికా దుర్మార్గమైన ఆంక్షల నేపథ్యంలో 2020లో వెనిజులా వద్ద ముడి చమురు కొనుగోలును మనదేశం నిలిపివేయాల్సి వచ్చింది. మదురోను అమెరికా అత్యంత అమానుషంగా కిడ్నాప్ చేసిన తర్వాత ఈ ఆంక్షలు ఎత్తివేయడంతో వెనిజులా నుండి ముడి చమురు కొనుగోళ్ళను భారత్ ప్రారంభించింది.



