బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించాలి: మేనేజర్ కృష్ణమూర్తి
నవతెలంగాణ – మిడ్జిల్
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు మొబైల్ ఫోన్లకు కొత్త లింకులు వస్తే ఓపెన్ చేయకూడదని, రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త లింకులతో మోసాలకు పాల్పడుతున్నారని బ్యాంకు లబ్ధిదారులకు బ్యాంకుల నుండి ఏ అధికారి కూడా ఫోను చేయరని సైబర్ నేరాల పైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ వికాస్ మిడ్జిల్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి అన్నారు.
ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని దోనూరు గ్రామంలో రైతులకు, మహిళా సంఘ సభ్యులకు, బ్యాంకు ఖాతాదారులకు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖాతాదారులందరూ కేవైసీని అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. నకిలీ లింకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏ లింకు పైన క్లిక్ చేయవద్దని బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా వ్యక్తిగత వివరాలు కేవైసీ అప్డేట్ లింకులను పంపించదని రైతులకు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు మొబైల్ ఫోనుకు ఫోన్ చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని ఓటీపీలను చెప్పరాదని అన్నారు. మహిళా సంఘ సభ్యులు , రైతులు, ఖాతాదారులు, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని చెప్పారు.
బ్యాంకులో ఉన్న లబ్ధిదారులు అందరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని , రోడ్డు ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి ఇన్సూరెన్స్ తో డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు. 20 రూపాయల నుండి, రూ.3000 ఇన్సూరెన్స్ కట్టుకుంటే 60 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివో జీబీ అధికారి జగన్మోహన్, మిడ్జిల్ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, రాఘవేంద్రమ్మ, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, బ్యాంకు సిబ్బంది, రైతులు మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



