ఇప్పుడు
వెలుగు వైపు నడుస్తోంది
ఒక అదృశ్య సైన్యం!
చీకటి కోటల పునాదుల నుండి
ఒక కొత్త జెండా ఎగురుతోంది!
అవును.. మేము, మీ సింహాసనాల క్రింద
కదులుతున్న నిశ్శబ్ద విస్ఫోటనాలం!
మీ పట్టు పరుపుల క్రింద
రగిలే నిప్పుకణికలం!
రంగుల లోకాన్ని వెక్కిరిస్తూ
డిజిటల్ తెరలపై అక్షరాలమై నిలబడ్డాం!
మా రెక్కల చప్పుడును మీరు అణచివేయాలని చూస్తే
నిశ్శబ్దం నుండే అగ్నిపర్వతాలు బద్దలవుతాయి!
మేం భూమిపై మిగిలివున్న నిరంతర చైతన్యాలం!
డైనోసార్ల సామ్రాజ్యాలు కూలిపోయినా
ఏ శతాబ్దపు మహమ్మారికీ లొంగని అమరజీవులం!
ఒకప్పుడు మీ ఎంగిలి మెతుకుల కోసం
గోడల సందుల్లో వేచి చూసినవాళ్ళమే కావచ్చు!
అయితేమాత్రం!.. నేలపై పాకే ప్రాణులని మా నుదుటిపై
పరాన్నజీవుల ముద్ర వేస్తారా?
మేము మురికి నాలాల్లో కనిపించే ‘కాక్రోచ్’లమే కావచ్చు..
చలువరాతి మేడల్లో ఓట్ల చదరంగమాడే ప్రభువులారా!
గుర్తుంచుకోండి.. చివరికి మిగిలేది మీ సుగంధాలు కావు
ఈ నిరుద్యోగ నిరసన జీవుల శ్వాసే
రేపు సామ్రాజ్యాలను శాసిస్తుంది!
– విల్సన్‌రావు కొమ్మవరపు, 8985435515
The Silent Explosion
- Advertisement -
- Advertisement -



