నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపితే…ఈనాడు సీఎం రేవంత్‌రెడ్డి రైతుల కోసం ప్రత్యేక రైతు డిస్కాం ఏర్పాటు చేసి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ఎం కోదండరెడ్డి చెప్పారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ సర్కారు మోటార్లకు మీటర్లు బిగించబోతుందనేది ప్రతిపక్షాల అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను రాజకీయం చేయడం సరైందికాదని ప్రతిపక్షాలను కోరారు. అన్ని పంటలకు మద్దతు నిర్ణయించడం, వాటిని కొనడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్‌భవన్‌లో రైతు కమిషన్ రూపొందించిన పంటల మార్పిడి నివేదికను కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, మెంబర్ సెక్రటరీ గోపాల్, స్పెషల్ అధికారి కేశవులుతో కలిసి ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే పంటల మార్పిడి అనివార్యమని చెప్పారు. కేరళ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పంటల మార్పిడిపై నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మే 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో పంటల మార్పిడిపై సుదీర్ఘంగా చర్చించామని గుర్తు చేశారు. ఆ నివేదికను సీఎంకు అందజేశామన్నారు. దీనిపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్లు వెల్లడించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా నివేదికను అందజేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రాకముందు వర్షాధార, సాంప్రదాయ పంటల సాగు అధికంగా ఉండేదని, కాలక్రమేణా రైతులు వరి, పత్తి పంటల వైపు మొగ్గుచూపారని తెలిపారు. వరి, పత్తి పంటలకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ, పత్తి కొనుగోళ్లలో అమలు చేసిన యాప్ విధానం, పంటపై విధించిన ఆంక్షలు, ఎకరానికి ఏడు క్వింటాళ్ల పరిమితి వంటి నిర్ణయాలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటల సాగు తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
కోతుల బెడద కారణంగా పలు పంటల సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సోలార్ ఫెన్సింగ్, కోతుల కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. వరి, పత్తి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, గిట్టుబాటు ధరలు కల్పించాలని నివేదికలో ప్రతిపాదించినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 23 పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ, కేంద్రం వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లకే పరిమితమవుతోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు, హమాలీల కొరత వంటి సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ కొనుగోళ్లు కొనసాగుతున్నాయని చెప్పారు.
తాను విద్యుత్ వినియోగం చేసిన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయని, తాను కూడా రైతునేనని, రైతు సమస్యలపై పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నానని చెప్పారు. కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చవద్దని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, రైతులు ఇంకా ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టాలు కూడా చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించారు. వర్షాలు కురిసిన తర్వాత పంట అవశేషాలను భూమిలో కలిపి దున్నడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరి వ్యర్థాలను కాల్చితే కేసులు నమోదవుతాయన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పంటల సాగు రైతులకు ప్రయోజనం చేకూర్చదని, కందులు, జొన్నలు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయల సాగు ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశముందని సూచించారు. ఈ పంటలకు గిట్టుబాటు ధర, బోనస్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. కోతుల బెడద నివారణకు నాబార్డు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, రైతుకు లాభం చేకూర్చే విధానాలే వ్యవసాయ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు.
రైతు డిస్కాం విప్లవాత్మకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



