శాలివాహన విద్యా శిరోమణి అవార్డు కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నవతెలంగాణ-కంఠేశ్వర్
తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి పెంచ్చోద్దని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శాలివాహన ( కుమ్మర ) ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అంబేద్కర్ భవన్లో విద్యార్థులకు విద్య శిరోమణి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పదో తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాకు దేశానికి మంచి పేరు తేవాలని చెప్పారు. విద్యను ఎవరు దొంగిలించే అవకాశం లేదని, విద్యతోనే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చన్నారు.
ప్రధానంగా ప్రతి విద్యార్థి స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ఫోన్లతో మంచి ఎంతో చెడు కూడా అంతకు రెట్టింపు ఉంటుందన్నారు. కుమ్మర కులస్తులు రాజకీయంగా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, శాలివాహన కులస్తులకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కుమ్మర ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భూపతి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సాయికుమార్, జిల్లా గౌరవాధ్యక్షులు కనకం గంగాధర్, సంఘ సభ్యులు హనుమాన్లు విసిగిరి గంగారం, ఆర్ కే ప్రజాపతి, సిర్పూరు చిన్నయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు చందూర్ బాబు, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీ నారాయణ, బీజేపీ నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.



