మండలానికి 1,52 లక్షల మొక్కలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పచ్చదనం కోసం గ్రామాల్లో మొక్కలు పెంచడానికి ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమానికి సన్నాహాలు మొదలయ్యాయి. అయితే గతేడాదితో పోల్చితే మండలంలో ఈ ఏడాది మొక్కలు నాటే లక్ష్యాన్ని గణనీయంగా తగ్గించింది. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, ఊరు వాడ, రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను నాటేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం వన మహోత్సవం విజయవంతం చేయడానికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. మొక్కలను నాటేందుకు ఉపాధి హామీ కూలీలతో అవసరమైన గుంతలను తవ్వించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతీ పరిధిలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. గతేడాది ఒక్కో గ్రామంలో 15 వేల మొక్కల పెంపకం టార్గెట్ ఉండగా..ఈ ఏడాది 10 వేలకు తగ్గించారు. ముఖ్యంగా స్థలం కొరత, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మండలానికి సుమారు 50 వేల మొక్కలను తగ్గించారు. ప్రతి గ్రామ పంచాయతీలోని నర్సరీల్లో పండ్లు, పూలు, నీడనిచ్చే కానుగ, గుల్మాహర్, వేప, చింత, గన్నేరు, మెహందీ, జామ, మునగ, మామిడి, కరివేపాకు వంటి మొక్కలు పెంచుతున్నారు.
కార్యాచరణ రూపొందిస్తున్నాం: హరీష్..ఎపిఓ
వన మహోత్సవానికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నాం. గ్రామపంచాయతీ తీర్మానాలు వచ్చిన వెంటనే గుంతలు తవ్వడం ప్రారంభిస్తాం. ప్రతి పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నాం. ప్రస్తుతం నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.


