తెలంగాణ క్రికెట్ హక్కుల సాధనకు పోరాటం
టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ :
తెలంగాణ క్రికెట్ హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమం అనివార్యమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి డి. గురువారెడ్డి అన్నారు. హెచ్‌సీఏలో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ టీసీఏ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్‌కే పరిమితమైంది. ప్రతిభావంతులైన జిల్లాల క్రికెటర్లు అవకాశాల కోసం హైదరాబాద్‌లో క్లబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎంపిక విధానం, క్లబ్ వ్యవస్థ, టోర్నమెంట్ల నిర్వహణ, పరిపాలన నిర్ణయాలు జిల్లాల క్రికెటర్లకు అన్యాయం చేసేలా ఉన్నాయని, తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు సమాన అవకాశాలు కల్పించాలి. టీజీ20 లీగ్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, క్లబ్ సభ్యత్వాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని’ గురువారెడ్డి డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో దశాబ్దాలుగా అన్యాయానికి గురైన తెలంగాణ క్రికెట్ హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమని అనివార్యమని గురువారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, టీసీఏ ప్రతినిధులు పి. విజయ్ చందర్ రెడ్డి, క్రికెటర్లు తదితరులు పాల్గొన్నారు.



