Monday, June 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకాళేశ్వరం కథ కంచికేనా !

కాళేశ్వరం కథ కంచికేనా !

- Advertisement -

ఏడాదైనా నోచుకోని మరమ్మతులు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల భవితవ్యం అగమ్యగోచరం
నైరుతి సమీపిస్తున్నా మొదలు కాని పనులు
మూడేండ్లుగా మూడు బ్యారేజీల్లో చుక్క నీరు కరువు


​ఊరగొండ మల్లేశం
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. కుంగిన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సీపేజీ, ఇసుక మేట సమస్యల విషయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సిఫార్సులు అమలు చేస్తూనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. ముఖ్యమంత్రితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఏటా వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం మొదలు వరకు మీటింగులు, సమీక్షలు చేస్తున్నారే తప్ప తట్టెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. ఫలితంగా మూడు బ్యారేజీల్లో చుక్క నీరు నిల్వ లేదు. సుందిల్ల నుంచి మేడి గడ్డ వరకు 80 కిలోమీటర్ల గోదావరి జలకళ లేక బోసి పోతోంది. ప్రాజెక్ట్‌‌ల మరమ్మతులపై ప్రభుత్వం చిత్తశుద్ది చూపడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని 20వ పిల్లర్ 2023 అక్టోబర్ 21న కుంగింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ రెండు బ్యారేజీలను తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటికి అవకాశం లేకుండా పోయింది.

ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని ఎన్‌డీఎసఏ నిపుణుల కమిటీ హెచ్చరించింది. బ్యారేజీ కుంగడానికి, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లడానికి నిర్మాణ సంస్థే ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం తేలింది. సీకెంట్ పైల్స్ వేయడంలో నిబంధనలు పాటించకపోవడం, పని పూర్తయిన తర్వాత కాఫర్‌డ్యాంను తొలగించకపోవడం వల్ల నీటి ప్రవాహంలో మార్పులు వచ్చి నిర్మాణం దెబ్బతిన్నట్టు గుర్తించారు. 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ మొదటి ఏడాది ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా దృష్టి సారించలేదు. ఈ ప్రాంత ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 2025లో మరమ్మత్తులపై నీటి పారుదల శాఖ కొంత కసరత్తు చేసింది. ఈ లోపే వర్షాకాలం మొదలు కావడంతో ఎలాంటి పురోగతి కాన రాలేదు. చరిత్ర పునరావృతం అయినట్టు ఈ ఏడాది సైతం అదే తంతు కొనసాగింది. మూడు బ్యారేజీల మరమ్మత్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌లపై సైట్ తనిఖీ నివేదికతో పాటు ప్రణాళికలను ఏప్రిల్‌లో సమర్పించింది.

ముగ్గురు సభ్యులతో కూడిన బృందం మేడిగడ్డ బ్యారేజ్‌ను అధ్యయనం చేసింది. మరో ఇద్దరు సభ్యులు బోర్‌ల ప్రాంతాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్‌ల వద్ద పరిశీలన పనులు కూడా పూర్తయ్యాయి. మూడు బ్యారేజీల పునరుద్ధరణ, డిజైన్లు కూడా కొలిక్కి వచ్చాయి. గత నెల మొదటి వారంలో పనులు ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల మేడిగడ్డ బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఏటా 2వేల టీఎంసీల నిటిని ఇంజినీరింగ్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తాకిడి, నిర్వహణ లేక పోవడం, బ్యారేజీ దిగువ నుంచి ఇసుక మేటలను క్వారీల ద్వారా తరలించడం వల్ల భవిష్యత్‌‌లో మొత్తం పిల్లర్లకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని సీడబ్ల్యూసీతో పాటు నీటి పారుదల రంగ నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

​రెడ్ జోన్‌లో 
మేడిగడ్డ…
మేడిగడ్డ బ్యారేజ్‌‌కు కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేటగిరీ వన్‌ కింద ప్రమాదకరమైన డ్యామ్‌గా గుర్తించింది. ఈ ఏడాది వేసవి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) 2025 ప్రకారం ప్రీ-మాన్‌సూన్, పోస్ట్-మాన్‌సూన్ తనిఖీల సందర్భంగా గుర్తించిన మరమ్మతులు, నిర్వహణ ప్రాతిపదికన దేశంలోని ఆనకట్టలను మూడు వర్గాలుగా (కేటగిరి 1,2,3) విభజించామన్నారు. కేటగిరి 3 కింద చిన్న మరమ్మత్తులు, కేటగిరి 2కింద సత్వర పరిష్కార చర్యలు అవసరమయ్యే ఆనకట్టలను చేర్చామన్నారు. కేటగిరి 1 కింద దేశంలోని మూడు ప్రాజెక్ట్‌లను ప్రమాదకరమైన వాటిగా గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీ ఉందని చెప్పారు. కాగా మేడిగడ్డ లోపాలను పరిష్కరించకపోతే బ్యారేజీకే ప్రమాదమని ఎన్‌డీఎస్‌ఏ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆనకట్టల నిర్వహణతో పాటు మరమ్మత్తులు ఆయా రాష్ట్రాలే చేపట్టాలని పేర్కొన్నారు. తాము దేశ వ్యాప్తంగా కేటగిరి 2,3 కింద ఉన్న అనకట్టల్లో తాము గుర్తించిన వాటికి మాత్రమే నిధులు సమకూరుస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -