– వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ. కోటి ఏడు లక్షలను జమ చేయించుకున్న నేరస్తులు
– ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో బస
– ఢిల్లీలో ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ట్రాఫిక్‌బాస్ డీ.జోయల్ డేవీస్ ఆదేశాలతో డీసీపీ వీ.అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జీ.శివమారుతి మార్గదర్శకత్వంలో సైబర్‌క్రైమ్ పోలీసులు ఢిల్లీకి వెళారు. అక్కడ డిజిటల్ అరెస్ట్ ముఠాల కోసం గాలించారు. ఈ క్రమంలో రూ. 1.07 కోట్ల భారీ సైబర్ మోసానికి పాల్పడిన కేసులో ఢిల్లీకి చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మనీ ఎక్స్ఛేంజ్, ట్రావెల్ వ్యాపారి గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, ఆర్‌వో టెక్నీషియన్ హర్ ప్రీత్ సింగ్ అలియాస్ కరణ్ కౌశిక్‌తోపాటు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్న ఖాతాదారుడైన కుమార్ మోహిత్ అలియాస్ మోహిత్ కౌశిక్‌లను అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్ 16న హైదరాబాద్‌కు చెందిన 62 ఏండ్ల బాధితుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని, బాధితుడి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అక్రమ కార్యకలాపాల్లో వినియోగించారని చెప్పారు. వృద్ధున్ని భయాందోళనకు గురిచేసిన నిందితులు మనీ లాండరింగ్ విచారణ పేరుతో మానసిక ఒత్తిడికి గురిచేశారు. అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ. 1,07,00,000 (కోటి ఏడు లక్షలు) వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు.
హోటళ్లలో అడ్డా…
పోలీసులకు చిక్కకుండా సైబర్ నేరస్తులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీబీఐ, కస్టమ్స్, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని అమాయకులకు ఫోన్‌చేసి ముందుగా పరిచయం చేసుకుంటున్నారు. డ్రగ్స్ లేదా టెర్రరిజం కేసుల్లో చిక్కుకున్నారని బాధితులను భయాందోళనకు గురిచేస్తున్నారు. తమ వద్ద వారెంట్ ఉందంటూ వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేసి గంటగంటకూ నివేదించాలని ఆదేశిస్తున్నారు. ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో అడ్డావేస్తున్న సైబర్ నేరస్తులు కమీషన్ ఆశ చూపి ఇతరుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. బాధితుల నుంచి వచ్చే డబ్బును సేకరించిన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఆ వెంటనే ప్రధాన సూత్రధారికి బదిలీ చేస్తున్నారు. మీరు అమాయకులను నిరూపించుకోవడానికి ఆస్తులను నగదుగా మార్చి సుప్రీంకోర్టుకు సమర్పించాలని బాధితులకు చెప్పి తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు అన్నికోణాల్లో విచారించారు. విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చేశాయి. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ల డేటాను పరిశీలించగా అందులో అనేక బ్యాంకు ఖాతాల వివరాలు లభ్యమయ్యాయి. ఈ ముఠాకు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన పలు సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
నకిలీ కాల్స్‌ను నమ్మొద్దు
పోలీసులు, సీబీఐ లేదా కోర్టు అధికారులు ఫోన్ కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని సైబర్ క్రైమ్స్ డీసీపీ వీ. అరవింద్ బాబు మంగళవారం వెల్లడించారు. కేసుల నుంచి విముక్తి కలిగిస్తామని ఏ ప్రభుత్వ సంస్థ డబ్బులను డిమాండ్ చేయదని గుర్తుంచుకోవాలన్నారు. బాధితులు ముఖ్యంగా సోషల్‌మీడియాలో, వాట్సాప్‌లో వచ్చే లింక్‌లను క్లిక్‌చేయవద్దని, గుర్తు తెలియని ఫోన్‌నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లకు స్పందించొద్దన్నారు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలను అపరిచితులకు షేర్ చేయవద్దని, మీ బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడకానికి ఇస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.



