Monday, June 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ హక్కులు ఏపీకి తాకట్టు

తెలంగాణ హక్కులు ఏపీకి తాకట్టు

- Advertisement -

చంద్రబాబు ఆనందం కోసం నీటి వాటాల్లో రేవంత్‌ రాజీ
గోదావరి-కావేరి అనుసంధానంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం : మాజీ మంత్రి హరీశ్‌‌రావు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మెప్పు కోసం తెలంగాణ నీటి వాటాలను సీఎం రేవంత్‌‌రెడ్డి తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌‌రావు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి, కృష్ణా జలాల వాటాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పు పట్టారు. పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీలు, డిండి ప్రాజెక్ట్‌‌కు 20 టీఎంసీల నీటికి ఏపీ ఎన్‌‌వోసీ ఇస్తే పోలవరం ప్రాజెక్ట్‌కు అనుకూలమని చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల అత్యధికంగా పాలమూరు జిల్లాకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పాలమూరుకు కేటాయించిన 90 టీఎంసీల్లో 45 మైనర్ ఇరిగేషన్, 45 డైవర్షన్ లో వచ్చేవి. పాతవి 811, కొత్తగా బ్రిజేష్ ట్రిబ్యునల్ చెప్పిన 194 కలిపితే 1005 టీఎంసీలు పున:పంపిణీ కింద సంక్రమిస్తాయి. అలాగే మరో45 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇచ్చే విషయం ట్రిబ్యునల్ తేల్చబోతున్నది. మొత్తంగా 1050లో కనిష్టంగా 700 టీఎంసీలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం 90 టీఎంసీలకు ఎన్ఓసీ ఇవ్వండి అన్ని నీళ్లు విడిచిపెట్టుకుంటం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరగనుంది’’ అని హరీశ్‌‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో కేటాయించిన 968 టిఎంసీలు, కృష్ణాలో రానున్న 1050 టీఎంసీల నీటికి సంబంధించిన ప్రాజెక్ట్‌ల క్లియరెన్స్ పూర్తయిన తర్వాతనే నదుల అనుసంధానం ప్రక్రియ గురించి మాట్లాడాలన్నారు.

గతంలో జరిగిన అపెక్స్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశాల్లో తాము కావేరి అనుసంధానానికి అనుకూలమనీ, అయితే ఇచ్చంపల్లి లేదా, సమ్మక్క బ్యారేజీ ద్వారా తరలించాడానికి మాత్రమే ఒప్పుకున్నామని చెప్పారు. ఇంటర్‌ ‌లింకేజిలో నీటిని తరలించే క్రమంలో స్థానిక రాష్ట్రానికి 50 శాతం వాటా ఉంటుందనీ, దాన్ని తెలంగాణకు ఇవ్వకుండా ఉండేందుకు పోలవరం నుంచి నేరుగా తరలించే కుట్రకు రేవంత్‌‌రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు. కావేరి అనుసంధానంపై బీజేపీ వైఖరి వెల్లడించాలని డిమాండ్‌ ‌చేశారు. మన రాష్ట్రం గుండా పోతే రూ.48వేల కోట్లు, పోలవరం బనకచర్ల ద్వారా అయితే రూ.82వేల కోట్లు ప్రాజెక్ట్‌‌కు ఖర్చు అవుతుందన్నారు. ఖర్చు, నిర్వహణ ఎక్కువ అయినా కేంద్రం ఏపీ ప్రయోజనాల కోసమే మొగ్గు చూపుతున్నా తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడాలని సూచించారు. పోలవరం కావేరీ లింక్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. అఖిల పక్ష‍ం ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని సూచించారు. ఏపీ నీటి దోపిడిపై ప్రభుత్వం ‌స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.

​301 టీఎంసీల నష్టం…
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నీటి విధానం వల్ల గోదావరి, కృష్ణాలో మొత్తం 301 టీఎంసీలు నష్ట పోతామని హరీశ్‌‌రావు అన్నారు. ‘‘గోదావరి నీటి వాటా 968 టీంసీలో 828 టీఎంసీలకు టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతించింది. మరో 139 టీఎంసీల అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కసారి పోలవరం-కావేరి లింక్‌ అయిన తర్వాత గోదావరిపై తెలంగాణ ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్ట్‌‌లను కేంద్రం అనుమంతించదు. పెండింగ్‌ అనుమతుల 139 టీఎంసీలు, ఇంటర్ లింకింగ్ డైవర్షన్ లో వచ్చే 74టీఎంసీలు కలిపి మొత్తం 211, కృష్ణాలో మరో 90 టీఎంసీలు నష్ట పోవాల్సి వస్తుంది. కేడబ్ల్యూడీటీ ముందు రెండు రాష్ట్రాలు నీటి వాటాలపై తమ వాదనలు ఇప్పటికే వినిపించాయి. త్వరలో అవార్డు రానున్న సందర్భంలో తెలంగాణ తొందరపడి పాలమూరుకు ఎన్‌‌వోసీ ఇస్తే పోలవరానికి ఒప్పు కోవడమంటే కృష్ణాలో 90 టీంసీలపై హక్కులు కోల్పోవాల్సి ఉంటుంది’’ అని హరీశ్‌‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్ట్‌‌కు, పాలమూరుకు లింక్‌ పెట్టడమంటే తెలంగాణ జల హక్కులను కాలరాయడమే అవుతుందన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -