విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా :
ఎన్టీఏ పై పార్లమెంటరీ ప్యానెల్ ఆగ్రహం
పరీక్ష నిర్వహణపై ఎన్టీఏ కు ప్రశ్నావళి పంపిన పార్లమెంటరీ ప్యానెల్
ఆన్-స్క్రీన్ మార్కింగ్, ఓఎస్‌ఎమ్ టెండర్ల అక్రమాలపై సీబీఎస్సీని నిలదీత
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్-యూజీ పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ పరిణామాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. పేపర్ లీక్ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని ఎన్టీఏను సూటిగా ప్రశ్నించింది. ఎన్టీఏ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఎప్పుడైనా పేపర్ లీక్‌లు జరిగాయా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరింది. నీట్ పేపర్ లీక్‌తోపాటు సీబీఎస్సీ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అక్రమాలపై పార్లమెం టరీ స్థాయీ సంఘం విచారణ జరుపుతోంది. నీట్ పేపర్ లీక్ కాలేదని, కేవలం ఒక గెస్ పేపర్‌లోని కొన్నిప్రశ్నలు మాత్రమే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయని ఎన్టీఏ బృందం స్థాయీసంఘానికి వివరించింది. ఎన్టీఏ సమాధానంపై అసహనం వ్యక్తంచేసిన స్థాయీ సంఘం, పేపర్ లీకేజీపై ఎన్టీఏకు ఉన్న అవగాహనపై సుదీర్ఘ ప్రశ్నావళిని జారీ చేసింది. రేపటిలోపు వాటికి లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఓఎస్ఎం విధానానికి సంబంధించి సీబీఎస్సీ కి కూడా ప్రశ్నావళిని పంపించింది.
ఈనెల పదో తేదీ వరకు సమాధానం చెప్పాలని స్థాయీ సంఘం సూచించింది. మరోవైపు, సీబీఎస్‌ఈ నుంచి వివరణాత్మక సమాధానాలు కోరింది పార్లమెంటరీ కమిటీ. గతం లో పేలవమైన పనితీరు కనబరిచిన రికార్డు ఉన్న బిడ్డర్లను అనర్హులుగా ప్రకటించే నిబంధనను ఎందుకు తొలగించారని ప్రశ్నించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గతంలో బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీలు కూడా పాల్గొనేలా నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్నించింది. కంపెనీ కనీస టర్నోవర్‌ను ప్రత్యేకంగా రూ.50 కోట్లుగా ఎందుకు నిర్ధారించారు? అలాగే, ఆర్‌ఎఫ్‌పీ నిబంధనలు, సొంత డేటా సెంటర్లు ఉన్న కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉండటం నుంచి, కేంద్ర సాంకేతిక శాఖ-ప్యానెల్డ్ డేటా సెంటర్లను ఉపయోగించే వారికి అనుకూలంగా ఎందుకు మారాయి? రోబోటిక్ స్కానర్ కోసం ఉన్న నిబంధనను తొలగించి, దాని స్థానంలో సాధారణ స్కానర్లను ఎందుకు చేర్చారు? పేపర్ల స్పైన్(బైండింగ్) కత్తిరిం చకుండా స్కాన్ చేయాలన్న నిబంధనను ఎందుకు తొలగించారు? ఇక, స్కానింగ్ రిజల్యూషన్‌ను 300 డీపీఐ నుంచి 200 డీపీఐకి ఎందుకు తగ్గిం చారు? గతంలో కనీసం ఒకే ప్రాజెక్టులో 5 లక్షల మంది విద్యార్థుల నివేదికలను నిర్వహించిన అను భవం ఉండాలనే నిబంధనను ఎందుకు మార్చారు? అని ప్యానెల్ ప్రశ్నించినట్టు తెలిపాయి.
ఓఎస్ఎం సిస్టమ్ కోసం గతంలో (2025 ఫిబ్రవరి, మే, ఆగస్టు)లో జారీ చేసిన సంబంధిత పత్రాలను కమిటీకి సమర్పించాలని ప్యానెల్ సీబీఎస్ఈని కోరిందని, అయితే సీబీఎస్ఈ దానికి కట్టుబడి లేదని వర్గాలు తెలిపాయి. అలాగే, ఓఎస్ఎం డ్రై రన్ పరిశీలకుల నివేదికపై తీసుకున్న చర్యను, అలాగే బోర్డు ఆ పరిశీలకుల నివేదికను విద్యా మంత్రిత్వ శాఖతో చర్చించిందా అనే విషయాన్ని కూడా తెలియజేయాలని ప్యానెల్ సీబీఎస్సీని కోరింది. నీట్ పరీక్ష రద్దు ఇదిలా ఉండగా, మే 3న జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. దీంతో ఎన్‌టీఏ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, నీట్ రీ ఎగ్జామ్ను జూన్ 21న నిర్వహిస్తామని ఎన్టీఏ ధ్రువీకరించింది. మరోవైపు, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తోంది.



